Addanki Dayakar: వారి పేర్లు కూడా గుర్తు లేదు కానీ.. ఏపీ కేంద్రమంత్రుల్ని చూస్తే సంతోషం వేసింది: అద్దంకి దయాకర్

Addanki Dayakar Praises AP BJP Criticizes Telangana BJP
  • అమరావతి కోసం లక్ష కోట్ల రూపాయలు తీసుకు వచ్చారన్న అద్దంకి దయాకర్
  • తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ఏమీ తీసుకు రావడం లేదని విమర్శ
  • తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి వాస్తవాలను వివరించారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు రాజధాని అమరావతి కోసం లక్ష కోట్ల రూపాయలు తీసుకువచ్చారని, వారిని చూస్తుంటే సంతోషంగా ఉందని, కానీ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు ఏమీ తీసుకురావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. పక్క రాష్ట్రంలోని కేంద్ర మంత్రుల పేర్లు కూడా సరిగ్గా గుర్తు లేదని, కానీ వారు తమ రాష్ట్రం కోసం నిధులు తీసుకువచ్చారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అక్కడి బీజేపీ నేతలు కేంద్రంతో పోరాడుతుంటే, తెలంగాణ బీజేపీ నేతలు ఏమీ చేయడం లేదని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తెలంగాణ నుండి ఇద్దరు కేంద్రమంత్రులుగా ఉన్నప్పటికీ, తెలంగాణకు వారు చేసిందేమీ లేదన్నారు. వీరికి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరొక పని లేదని మండిపడ్డారు.

రైతు భరోసా గురించి బండి సంజయ్ ఏదో బాధపడుతున్నట్లుగా ఉన్నారని, కానీ దానిని తీసేస్తామని ఎవరూ చెప్పలేదని తెలిపారు. చేతనైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా సాధించుకొని రావాలని హితవు పలికారు. కనీసం విభజన చట్టంలోని అంశాలనైనా సాధించుకొని రావాలని అన్నారు. ఈటల రాజేందర్ వైఖరి సగం బీజేపీ, సగం బీఆర్ఎస్ అన్నట్లుగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి వాస్తవాలను వివరించారు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వాస్తవాలను నిష్పక్షపాతంగా వివరిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల కారణంగా ప్రస్తుతం నెలకు ఏకంగా రూ.7 వేల కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణను దోచుకున్నది బీఆర్ఎస్ నాయకులేనని విమర్శించారు. ఉద్యమం పేరుతో నాటకమాడి, సొంత పార్టీని నిర్మించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రవర్తనలో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని, ఆయన పాత పద్ధతులనే అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. కాలు విరిగినప్పటికీ కేటీఆరే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ, కేటీఆర్‌ను రాజకీయంగా తెరపైకి తీసుకురావడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో సీనియర్ నేత హరీశ్ రావు ఫొటో కనిపించలేదని అన్నారు. హరీశ్ రావును కరివేపాకులా వాడుకుని పక్కన పెట్టేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Addanki Dayakar
BJP
Telangana
Andhra Pradesh
Central Ministers
KCR
Revanth Reddy
BRS
Telangana Politics
Amaravati

More Telugu News