Sai Pallavi: సాయిపల్లవి భారీ రెమ్యునరేషన్ పై బాలీవుడ్ లో తీవ్ర చర్చ

Sai Pallavis Huge Remuneration Sparks Debate in Bollywood
  • బాలీవుడ్ చిత్రం 'రామాయణ' సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న సాయిపల్లవి
  • ఏకంగా రూ. 13 కోట్లు డిమాండ్ చేసినట్టు బీటౌన్ లో చర్చ
  • సాయిపల్లవిపై బాలీవుడ్ హీరోయిన్లు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు గతంలోనే వార్తలు
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టుల్లో 'రామాయణ' ఒకటి. ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సాయి పల్లవి పారితోషికంపై ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త బీ-టౌన్‌లో చక్కర్లు కొడుతూ, తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ 'రామాయణ' కోసం సాయి పల్లవి ఏకంగా రూ. 13 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక నాయిక ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే ప్రథమం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో రావణాసురుడి పాత్రలో శాండల్‌వుడ్ స్టార్ యష్ కనిపించనుండగా, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. సీత పాత్రకు దక్షిణాది నటి సాయి పల్లవిని ఎంపిక చేయడంపై కొందరు బాలీవుడ్ నటీమణులు అసంతృప్తి వ్యక్తం చేశారని, "బాలీవుడ్‌లో నటీమణులే కరవయ్యారా? పొరుగు రాష్ట్ర నటిని ఎందుకు తీసుకోవాలి?" అని మండిపడ్డారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

ఈ భారీ పారితోషికం వార్త బయటకు రావడంతో, సాయి పల్లవిపై నెట్టింట కొందరు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన కొందరు, "సాయి పల్లవికి అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆమెకు అంత సీన్ ఉందా?" అంటూ ఘాటుగా విమర్శిస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవడానికి ఆమె అర్హురాలేనా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి.

అయితే, సాయి పల్లవి నిజంగానే రూ.13 కోట్లు డిమాండ్ చేశారా? లేదా ఇవి కేవలం వదంతులేనా? అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Sai Pallavi
Ramayana Movie
Bollywood
Remuneration
Ranbir Kapoor
Yash
Nitesh Tiwari
13 Crores
South Indian Actress
Bollywood Controversy

More Telugu News