India: ఈ రెండు ఆయుధాలతో... 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్

India Uses Scalp  Hammer to Destroy Terror Camps
  • పహల్గామ్ దాడికి బదులుగా 'ఆపరేషన్ సింధూర్'
  • పీఓకే, పాక్ పంజాబ్‌లో ఉగ్ర స్థావరాలు ధ్వంసం
  • జైషే, లష్కరేకు చెందిన 80 మంది ఉగ్రవాదుల మృతి
  • మసూద్ అజార్ కుటుంబసభ్యులు 10 మంది హతం
  • స్కాల్ప్, హామర్ క్షిపణులతో నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిగా, భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సింధూర్' చేపట్టడం తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) తో పాటు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలపై నిర్దిష్ట దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 80 మంది ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, బహవల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా ఈ దాడుల్లో మరణించినట్లు సమాచారం.

అత్యాధునిక ఆయుధాల వినియోగం
ఈ ఆపరేషన్‌లో భారత వాయుసేన ఉపయోగించిన ఆయుధాలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చిన స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ (హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్‌టెండెడ్ రేంజ్) ప్రెసిషన్-గైడెడ్ ఆయుధాలను ఈ దాడుల కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ రెండు అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించినట్లు సమాచారం.

స్కాల్ప్ క్షిపణి... ఇది చిక్కదు దొరకదు!
'స్టార్మ్ షాడో'గా కూడా పిలువబడే స్కాల్ప్ క్షిపణి, సుదూర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడింది. ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగల (స్టెల్త్) లక్షణాలను కలిగి ఉంది. ఈ క్షిపణిని శత్రువులు పసిగట్టడం చాలా కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. విమానాల నుంచి ప్రయోగించగల ఈ క్రూయిజ్ క్షిపణిని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉపయోగిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. 

450 కిలోమీటర్ల పరిధి కలిగిన స్కాల్ప్, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. దీనిలో ఐఎన్ఎస్, జీపీఎస్, భూతల సంకేతాల ఆధారిత అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థ ఉంది. యూరోపియన్ కన్సార్టియం ఎంబీడీఏ దీనిని తయారు చేసింది. బంకర్లు, ఆయుధాగారాల్లోకి చొచ్చుకుపోయే శక్తి దీనికి ఉంది. లక్ష్యాన్ని సమీపించినప్పుడు, క్షిపణిలోని ఇన్‌ఫ్రారెడ్ సీకర్ టార్గెట్‌ను గుర్తించి, దానిలోకి చొచ్చుకుపోతుంది. ఇది 450 కిలోల బరువున్న వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. 
హామర్ గైడెడ్ బాంబు... శత్రువులకు సవాల్
ఆపరేషన్ సింధూర్‌లో వినియోగించిన మరో కీలక ఆయుధం హామర్. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగల ఎయిర్-టు-సర్ఫేస్ ప్రెసిషన్ గైడెడ్ బాంబు. దీనిని 'గ్లైడ్ బాంబ్'గా కూడా వ్యవహరిస్తారు. ఇది దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. దీనికి 250, 500, లేదా 1000 కిలోల వార్ హెడ్ లను అమర్చవచ్చు. ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ దీనిని ఉత్పత్తి చేస్తోంది. కఠినమైన భూభాగాలపై తక్కువ ఎత్తు నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. దీనిని అడ్డుకోవడం శత్రువులకు సవాల్‌తో కూడుకున్న పని. పటిష్టమైన భవనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం హామర్‌కు ఉంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా కార్యాలయాలను ధ్వంసం చేయడానికి భారత్ ఈ ఆయుధాన్నే ప్రయోగించినట్లు తెలుస్తోంది.
India
Operation Sindhu
Surgical Strike
Pakistan
Jaish-e-Mohammed
Lashkar-e-Taiba
Scalp Cruise Missile
Hammer Guided Bomb
Rafale Jets
Masood Azhar

More Telugu News