Mallikarjun Kharge: ఆపరేషన్ సిందూర్.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అనంతరం ఖర్గే స్పందన

Congress Supports Operation Sindhu Kharges Statement
  • ఆపరేషన్ సింధూర్‌'ను స్వాగతించిన కాంగ్రెస్
  • భారత సైన్యానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
  • ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర భేటీ
  • సైన్యం చర్యను ప్రశంసించిన ఖర్గే, రాహుల్ గాంధీ
  • గురువారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్‌'ను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈ విషయంలో సైనిక దళాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పార్టీ ప్రకటించింది.

ఈ కీలక పరిణామాల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నేడు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, సచిన్‌ పైలట్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, "ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సాయుధ దళాలను చూసి తాము గర్విస్తున్నాం" అని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి అన్ని స్థాయిల్లో ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. "దేశ రక్షణ, ఐక్యత, స్వేచ్ఛను కాపాడటానికి మా పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నాం" అని తెలిపారు. సాయుధ దళాలకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్‌ గాంధీ కూడా స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా, ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడుల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో జరగనుంది. పహల్గామ్ దాడి అనంతరం, ఏప్రిల్‌ 24న కూడా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
Mallikarjun Kharge
Operation Sindhu
Congress Party
Rahul Gandhi
Priyanka Gandhi
Pakistan
POK
Terrorism
India
Army

More Telugu News