Rahul Vaidya: కోహ్లీతో వివాదం వేళ.. అనుష్క శర్మ చేతిని ముద్దాడిన రాహుల్ వైద్య వీడియో వైరల్

Viral Video Rahul Vaidyas Anushka Sharma Gesture Fuels Kohlis Fans Anger
  • రాహుల్ వైద్య-కోహ్లీ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వివాదం
  •   అనుష్క శర్మతో రాహుల్ పాత వీడియో వైరల్
  •  రాహుల్‌ను కోహ్లీ బ్లాక్ చేయడానికి ఇదే కారణమంటున్న నెటిజన్లు 
ప్రముఖ గాయకుడు రాహుల్ వైద్య, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ కార్యకలాపాలపై రాహుల్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. దీనికి తోడు, నటి అనుష్క శర్మతో రాహుల్ ఉన్న ఒక పాత వీడియో తాజాగా వైరల్ కావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల నటి అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ పొరపాటున లైక్ చేశాడు. ఆపై అది "ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ లోపం" వల్లే జరిగిందని వివరణ ఇచ్చాడు. ఈ ఘటనపై రాహుల్ వైద్య తనదైన శైలిలో స్పందించాడు. "విరాట్ కోహ్లీ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడని అందరికీ తెలుసు. అది కూడా బహుశా ఒక సాంకేతిక లోపం వల్లే జరిగి ఉంటుంది. కోహ్లీ కావాలని చేసి ఉండడు. 'నీ తరఫున రాహుల్ వైద్యను నేను బ్లాక్ చేస్తానులే' అని ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ కోహ్లీకి చెప్పి ఉండొచ్చు. ఇందులో అర్థముంది కదా?" అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారమైంది.

అభిమానుల ఆగ్రహం
రాహుల్ వైద్య చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు నవ్వుకున్నప్పటికీ, విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్‌ను ఆన్‌లైన్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనిపై మౌనంగా ఉండని రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఘాటుగా స్పందించారు. "విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు" అని వ్యాఖ్యానించాడు. మరో స్టోరీలో తన కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. "నన్ను తిడితే సరే, కానీ ఈ విషయంతో ఏమాత్రం సంబంధంలేని నా భార్యను, సోదరిని కూడా దూషిస్తున్నారు! అందుకే మీరంతా 'రెండు పైసల జోకర్లు' అని నేను అన్నది నూటికి నూరు పాళ్లు నిజం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

 వైరల్ అవుతున్న పాత వీడియో 
ఈ వివాదం కొనసాగుతుండగానే రాహుల్ వైద్య గతంలో ఒక కార్యక్రమంలో వేదికపై అనుష్క శర్మపై పాట పాడుతూ ఆమె చేతిని ముద్దాడుతున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మీమ్స్, జోకులు పేలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం కోహ్లీ తనను ఇన్‌స్టాగ్రామ్లో బ్లాక్ చేశాడని రాహుల్ చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ బహుశా అనుష్కతో ఉన్న ఈ పాత వీడియో వల్లే కోహ్లీ అతడిని బ్లాక్ చేసి ఉంటాడేమోనని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ పరిణామాలతో రాహుల్ వైద్యకు, విరాట్ కోహ్లీ అభిమానులకు మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
Rahul Vaidya
Virat Kohli
Anushka Sharma
Social Media Controversy
Viral Video
Instagram
Celebrity Feud
Indian Singer
Cricket
Bollywood Actress

More Telugu News