All-Party Meeting: 'ఆపరేషన్ సిందూర్' గురించి అన్ని రాజకీయ పార్టీలకు వివరించడానికి కేంద్రం అఖిలపక్ష సమావేశం

Rajnath Singh Addresses All Party Meet on Operation Sindhoor
  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత ఆల్ పార్టీ మీటింగ్
  • కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జై శంకర్‌, కిరణ్‌ రిజిజు హాజ‌రు
  • పాల్గొన్న‌ కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు
ఆపరేషన్ సిందూర్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు వివరించడానికి కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఉదయం 11 గంటలకు రాజ్‌నాథ్‌ అధ్యక్షతన అన్ని పార్టీల నేతలు సమావేశం అయ్యారు.

ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జై శంకర్‌, కిరణ్‌ రిజిజు సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి సందీప్ బందోపాధ్యాయ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు సమావేశంలో పాల్గొన్నారు.

ఇతర ప్రతిపక్ష నాయకులలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్, శివసేన (యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్, ఎన్‌సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే, బీజేడీకి చెందిన సస్మిత్ పాత్రా, సీపీఐ(ఎం)కి చెందిన జాన్ బ్రిట్టాస్ ఉన్నారు. ఈ సమావేశంలో పాక్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ వివరాలను రక్షణ మంత్రి పంచుకుంటున్నారు.

ఇక‌, ఈ అఖిల పక్ష సమావేశం గురించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు. "2025 మే 8న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్: G-074లో ప్రభుత్వం అఖిల పక్ష నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది" అని ఆయన అన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై బుధవారం తెల్లవారుజామున తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ప్రతిదాడికి దిగి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తాయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 
All-Party Meeting
Rajnath Singh
Operation Sindhoor
India-Pakistan
Amit Shah
Rahul Gandhi
Terrorism
Jammu and Kashmir
Pakistan
Cross-border strike

More Telugu News