MS Dhoni: చ‌రిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్ హిస్టిరీలోనే ఒకే ఒక్క‌డు!

MS Dhonis Unmatched IPL Feat 100 Not Outs
  • నిన్న‌టి కేకేఆర్‌తో మ్యాచ్‌లో అజేయంగా 18 పరుగులు చేసిన ఎంఎస్‌డీ 
  • త‌ద్వారా ఐపీఎల్ చ‌రిత్ర‌లో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయ‌ర్‌గా రికార్డు
  • ధోనీ త‌ర్వాత రెండో స్థానంలో సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్ రవీంద్ర జడేజా
బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. నిన్న‌టి మ్యాచ్‌లో ఎంఎస్‌డీ అజేయంగా 18 పరుగులు చేశారు. త‌ద్వారా ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే మరే ఇతర ఆటగాడు సాధించని ప్రత్యేకమైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. 

మ‌హీ ఇప్పటికే అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆట‌గాళ్ల‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండ‌గా... ఇప్పుడు అతను 100 సార్లు నాటౌట్ అనే మైలురాయిని కూడా సాధించాడు. మొత్తం 241 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను న‌మోదు చేశాడు. కాగా, ఈ జాబితాలో ధోనీ త‌ర్వాత రెండో స్థానంలో సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్ రవీంద్ర జడేజా ఉన్నాడు. అతను 80 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.

ఇక, ఈ సీజ‌న్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కే 12 మ్యాచులాడి కేవ‌లం మూడింట మాత్ర‌మే గెలిచింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో ఉంది. మ‌రోవైపు నిన్న‌టి మ్యాచ్‌లో ఓడిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కు కూడా ప్లేఆఫ్స్ అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టంగా మారాయి. 

ఆ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచులాడి ఐదు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. కేకేఆర్ ఖాతాలో ప్ర‌స్తుతం 11 పాయింట్లు ఉన్నాయి. మిగ‌తా రెండు మ్యాచుల్లో గెలిస్తే 15 పాయింట్లు అవుతాయి. కానీ, ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేర‌డానికి ఇవి స‌రిపోవు. ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. 
MS Dhoni
IPL
Chennai Super Kings
CSK
Kolkata Knight Riders
KKR
Cricket
Record
Not Out
Ravindra Jadeja

More Telugu News