Lokesh Nara: ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్‌గా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం బాటలు: మంత్రి లోకేశ్‌

Andhra Pradesh to Become Electronics Powerhouse says Minister Nara Lokesh
  • ఎల్‌జీ శ్రీసిటీ యూనిట్‌కు మంత్రి లోకేశ్‌ భూమిపూజ
  • స్థానిక ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనున్న ఎల్‌జీ యూనిట్
  • రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎఫ్‌డీఐ శ్రీసిటీ ఎల్‌జీ యూనిట్
  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ
  • తాము రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నామ‌న్న మంత్రి లోకేశ్‌
రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్‌కు లోకేశ్‌ నేడు భూమిపూజ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.... "మేం ఈరోజు ఎల్‌జీ యూనిట్ కు మాత్రమే కాదు... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దది. ఇది మన రాష్ట్రంతో పాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. ఆవిష్కరణ పెట్టుబడిని కలిసే చోట, భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్‌ను తీసుకురావడమే గాక ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది. 

మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్‌జీ శ్రీసిటీ యూనిట్ ఆవిష్కృతమైంది. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. మేము సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడమేగాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నాం. 

శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ అత్యాధునిక తయారీ కర్మాగారానికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మీ ముందుకు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, ఎల్‌జీ, దాని విక్రేత కంపెనీల నాయకత్వ బృందాలు, భాగస్వాములందరికీ నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

మేము రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నాం!
ఎల్‌జీ ఫ్యాక్టరీ అధునాతన గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తులను స్మార్ట్, ఇంధన సమర్థవంతమైన సాంకేతికతతో అందిస్తుంది. ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ, ఒక స్మార్ట్ రాష్ట్రం, ఒక స్మార్ట్ దేశం సరికొత్త ప్రయాణం ఈరోజు ప్రారంభమవుతుంది. ఇది కేవలం తయారీ గురించి కాదు... ఇది జీవన భవిష్యత్తును రూపొందించడం గురించి. ఇది ఉద్యోగాలను సృష్టించడం, మన యువతకు సాధికారత కల్పించడం, జీవితాలను మార్చడం గురించి. మేము కేవలం కర్మాగారాలను నిర్మించడం లేదు... మేము రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నాం. 

ఎల్‌జీ ప్రధాన యూనిట్ దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఎల్‌జీ ముఖ్య విక్రేతలు అదనంగా రూ. 839 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా మరో 690 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కంపెనీకి ఒక కొత్త ఆవిష్కరణ కంటే ఆంధ్రప్రదేశ్ యువతకు కలల సాకార క్షణం అనొచ్చు. ఎల్‌జీ సప్లయ్ చైన్ ను మరింత బలోపేతం చేయడమేగాక దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే హైటెక్ యూనిట్.  

ఎల్‌జీ నాలుగు కీలక విక్రేత భాగస్వాములైన ఎకోరియా, కురోడా ఎలక్ట్రిక్, హేంగ్ సంగ్ ఇండియా, క్యుంగ్‌సంగ్ ప్రెసిషన్ అండ్ టేసంగ్ ఎలక్ట్రానిక్స్‌ భాగస్వామ్య శక్తి పురోగతికి పాస్‌పోర్ట్ లాంటివి. ఇది వారి ఉమ్మడి సహకార వృద్ధి శక్తిని చాటడమేగాక ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తనను తాను ఎలా నిలబెట్టుకుంటుందో కూడా ప్రపంచానికి చూపిస్తుంది" అని మంత్రి లోకేశ్ తెలిపారు. 

Lokesh Nara
Andhra Pradesh
Electronics Manufacturing
LG Electronics
Sri City
FDI
Job Creation
Smart Factory
Industrial Growth
AP Investment

More Telugu News