Nara Lokesh: శ్రీసిటీకి విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తాం: మంత్రి లోకేశ్‌

AP Minister Nara Lokesh Promises Direct Airport Connectivity for Sri City
  • ఎల్‌జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామ‌న్న మంత్రి
  • రాబోయే 4ఏళ్లలో శ్రీసిటీకి తిరుపతి ఎయిర్‌పోర్టుతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామ‌ని వెల్ల‌డి
  • ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఏపీను ఎంచుకున్న ఎల్‌జీకి లోకేశ్‌ ధన్యవాదాలు
అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్‌కు  మంత్రి నారా లోకేశ్‌ ఇవాళ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.... ఎల్‌జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామ‌న్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్‌జీ సిటీ నిర్మించాల‌ని కోరారు. రాబోయే నాలుగేళ్లలో శ్రీసిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామ‌ని తెలిపారు. 

పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామ‌ని ఎల్‌జీ సంస్థ ప్ర‌తినిధుల‌తో మంత్రి అన్నారు. ఒక ప్రతిష్ఠాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కు ధన్యవాదాలు తెలియ‌జేశారు. ఎల్‌జీ ఫ్యాక్టరీ ప్రతి యువ ఇంజనీర్, ప్రతి ఆశావహ సాంకేతిక నిపుణుడు, ప్రతి వ్యవస్థాపకుడికి కలల కర్మాగారంగా మారబోతోందని ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. 

భారత్‌లో కొరియా రాయబారి  లీ సియాంగ్ హో మాట్లాడుతూ... గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో తమ దేశానికి చెందిన కియా కంపెనీ ఏర్పాటైంద‌ని, ఇప్పుడు ఎల్‌జీ వస్తోంద‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప‌రిశ్రమల ఏర్పాటుకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్,  భారత్ లో కొరియన్ రిపబ్లిక్ రాయబారి లీ సియాంగ్ హో, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ హోం సొల్యూషన్స్ సీఈఓ జేచియోల్ లియు, ఎకో సొల్యూషన్స్ సీఈఓ జే సంగ్ లీ, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాశ్‌, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అభిషిక్త్ కిశోర్‌, కాన్సులేట్ జనరల్ (ఏపీ, తెలంగాణ) చుక్కపల్లి సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
LG Electronics
Sri City
Tirupati Airport
Andhra Pradesh
Investment
Industry
Korea
Direct Connectivity
Chandrababu Naidu

More Telugu News