KTR: ఆపరేషన్ సిందూర్ పై కేటీఆర్ స్పందన

KTR Calls for Support for Indian Army Amidst Conflict
  • దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలన్న కేటీఆర్
  • ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు ఒరిగిందేమీ లేదని విమర్శ
  • రేవంత్ రెడ్డి అంత నికృష్ట సీఎంను చూడలేదని వ్యాఖ్య
పాకిస్థాన్‌తో భారతదేశం పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో, దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు, కేటీఆర్ మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్, దివంగత నేత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, రైతుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు, కానీ జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అఫిడవిట్లు, బాండ్లు రాసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, ఆడబిడ్డలకు తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేటీఆర్, "ఖమ్మం జిల్లా ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు ఓటేశారు, ఇప్పుడు ఆ మార్పు ఎక్కడ కనబడుతోంది?" అని వ్యాఖ్యానించారు. "మా పరిపాలనపై కొద్దిగా బోర్ కొట్టి, వారికి ఓట్లు వేశారు. ఇప్పుడు ఏమైంది?" అని ప్రజలనుద్దేశించి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, వారిని నిలదీసి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. "రేవంత్ రెడ్డి అంత నికృష్ట ముఖ్యమంత్రిని చూడలేదు. ఢిల్లీలో ఆయనకు అపాయింట్‌మెంట్లు దొరకడం లేదని, అక్కడ ఆయన్ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిగా, దొంగలా చూస్తున్నారని అంటున్నారు. దొంగను దొంగలా కాకుండా మరెలా చూస్తారు?" అంటూ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కూడా ఇటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ఊహించి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు.

త్వరలో ప్రజలకు మంచి అవకాశం వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్‌గా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నింటినీ గెలుచుకుని గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
KTR
K.T. Rama Rao
BRS
Telangana Politics
Revanth Reddy
Congress
Khammam
local body elections
Telangana
India-Pakistan conflict

More Telugu News