TTD: తిరుమలలో చైనీస్ ఫుడ్ పై నిషేధం.. హోటళ్లకు మార్గదర్శకాలు జారీ!

TTD Bans Chinese Food in Tirumala
  • ఆహార నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు
  • హోటల్ సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణ ధరించాలని టీటీడీ ఆదేశం
  • ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలన్న అదనపు ఈవో
తిరుమల క్షేత్రంలో విక్రయించే ఆహార పదార్థాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల కొండపై చైనీస్ ఫుడ్ ఐటమ్స్ విక్రయించడంపై శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల ఆరోగ్యం, ఆహార నాణ్యత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

తిరుమలలోని హోటళ్లు, తినుబండారాల శాలల్లో లభించే ఆహార పదార్థాల నాణ్యతపై ఇటీవల భక్తుల నుంచి పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తిరుమలలోని హోటళ్ల యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భక్తులకు అందించే ఆహారం విషయంలో పలు ముఖ్యమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో ప్రధానంగా చైనీస్ ఫుడ్ అంశం చర్చకు వచ్చింది. ఇకపై తిరుమలలో ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచూరియా వంటి ఎలాంటి చైనీస్ తరహా ఆహార పదార్థాలను విక్రయించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, దీనిని కచ్చితంగా పాటించాలని హోటళ్ల నిర్వాహకులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన, శుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల అభిరుచులకు అనుగుణంగా వారికి నచ్చిన రీతిలో వైవిధ్యమైన భారతీయ వంటకాలను అందించాలని సూచించారు. ఆహార తయారీలో, హోటళ్ల నిర్వహణలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని నొక్కిచెప్పారు.

ఆహార నాణ్యతతో పాటు, హోటళ్ల నిర్వహణకు సంబంధించి కూడా అదనపు ఈవో పలు మార్గదర్శకాలను జారీ చేశారు. హోటళ్లలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా సంప్రదాయాలను గౌరవిస్తూ, అందుకు అనుగుణమైన వస్త్రధారణలోనే విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి హోటల్ వద్ద ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ తదితర ధృవీకరణ పత్రాలను అధికారులకు, భక్తులకు స్పష్టంగా కనిపించేలా ఫ్రేమ్ చేసి ప్రదర్శించాలి చెప్పారు. 

భక్తుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపుల విధానాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని దుకాణాలలో తప్పనిసరిగా ధరల పట్టికను ప్రదర్శించాలని, నిర్దేశిత ధరలకే విక్రయాలు జరపాలని చెప్పారు. హోటల్ నిర్వహణ లైసెన్సులను నిర్ణీత సమయంలో పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేశారు.
TTD
Tirumala
Tirupati
Chinese Food Ban
Food Safety
Hotel Guidelines
Venkayya Chowdary
Hygiene
Food Quality
Indian Cuisine

More Telugu News