Jeevan Lal: ఏకంగా రూ.70 లక్షల లంచం... ఐఆర్ఎస్ అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ

CBI Arrests IRS Officer Jeevan Lal for Rs 70 Lakh Bribe
  • సీబీఐకి అడ్డంగా దొరికిపోయిన ఆదాయపన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్
  • ఐటీ అప్పీళ్లను పరిష్కరించేందుకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి
  • ఐటీ కమిషనర్ జీవన్ లాల్ తో పాటు మరో నలుగురు అరెస్టు
  • నిందితులను సీబీఐ కోర్టుకు హజరుపర్చి రిమాండ్‌కు తరలించిన అధికారులు
ఓ ప్రముఖ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆదాయపన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడైన జీవన్ లాల్ 2004 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి.

ప్రస్తుతం ఆయన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ హోదాలో పని చేస్తున్నారు. ఆయన సతీమణి కూడా కేంద్ర సర్వీసు (సీఐఎస్ఎఫ్)లో ఉద్యోగం చేస్తున్నారు. ఆదాయపన్ను ఎగవేతదారులను పట్టుకుని వారి నుంచి పన్ను కట్టించాల్సిన ఉన్నతాధికారే మధ్యవర్తుల ద్వారా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడటం ఆదాయపన్ను శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఐటీ అప్పీల్ యూనిట్ 7,8కి ఇన్ ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జీవన్ లాల్, ఐటీ అప్పీళ్లను పరిష్కరించేందుకు కొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు అందడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ముంబయిలో శుక్రవారం షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు ప్రతినిధుల నుంచి జీవన్ లాల్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రూ.70 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో జీవన్ లాల్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ముంబయి, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ, విశాఖపట్నంలోని 18 ప్రాంతాల్లో శనివారం సోదాలు జరిపారు. ఈ సందర్భంగా కీలక పత్రాలతో పాటు రూ.69 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జీవన్ లాల్‌తో పాటు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయిరాం పోలిశెట్టి, విశాఖకు చెందిన నట్టా వీరనాగ శ్రీరాంగోపాల్, షాపూర్ జీ గ్రూపు డీజీఎం కాంతిలాల్ మెహతా, సాజిదా మజహర్ హుస్సేన్ షాను అరెస్టు చేశారు.

ఐదుగురు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసిన నేపథ్యంలో ముంబయి, విశాఖ, హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుల్లో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీబీఐ అధికారులు తెలిపారు. లంచం డబ్బు, సోదాల్లో దొరికిన డబ్బు కలిపి మొత్తం రూ.1 కోటి 39 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 
Jeevan Lal
IRS Officer
CBI Arrest
Bribery
Income Tax Department
Shapoorji Pallonji Group
Mumbai
Hyderabad
Khammam
Corruption

More Telugu News