Narendra Modi: మోదీ మా నమ్మకాన్ని కోల్పోయారు.. నెటిజన్ల మిశ్రమ స్పందన

Modi Loses Public Trust After Ceasefire Netizens React
  • భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 
  • సోషల్ మీడియాలో భిన్న స్వరాలు
  • కొందరు స్వాగతిస్తే.. మరికొందరు మండిపాటు
  • పాకిస్థాన్‌ను నమ్మొద్దంటున్న నెటిజన్లు
  • మోదీ తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశారంటూ ఆగ్రహం
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయిలో చెలరేగిన సైనిక ఘర్షణలకు తెరదించుతూ ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఈ విషయాన్ని భారత్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణపై భారత్ చేసిన ఈ ప్రకటన ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది. పాకిస్థాన్‌పై విజయం సాధించే వరకు భారత్ తన దూకుడును కొనసాగించి ఉంటే బాగుండేదని అత్యధికమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. భారత ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కాల్పుల విరమణ వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికలు భిన్నమైన స్పందనలతో హోరెత్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని నివారించడం ముఖ్యమని కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, మరికొందరు దీనిని నిరాశాజనకమైన వెనుకంజగా అభివర్ణించారు. చర్చల్లో అమెరికా ప్రమేయం ఉందన్న వార్తలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. బయటి మధ్యవర్తిత్వం అవసరమేమిటని కొందరు ప్రశ్నించారు.

తాము దీనిని ఊహించలేదని, అమెరికా ఒత్తిడికి తలొగ్గుతారని అస్సలు అనుకోలేదని, పాకిస్థాన్‌ను ఆక్రమించి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందని రుద్రరాజు అనే యూజర్ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌ను అస్సలు నమ్మొద్దని, వారిని నాశనం చేయాల్సిందేనని వినోద్ కౌల్ అనే మరో యూజర్ వ్యాఖ్యానించాడు. 

ప్రధాని మోదీ భారత ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలని, ఆయన ప్రధాని అభ్యర్థి అయితేనే ఓటు వేస్తానని కల్పేష్ అనే మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మోదీ తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశారని విమర్శించాడు. ఈ కాల్పుల విరమణ వల్ల శాశ్వత శాంతి నెలకొంటుందా? అని చాలామంది ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పాకిస్థాన్ వైపు నుంచి మరోమారు చొరబాట్లు జరగవని హామీ ఉంటుందా?, అమాయకులు ప్రాణాలు కోల్పోరని ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలవా? అని సంజీవ్ రంజన్ అనే ఫేస్‌బుక్ యూజర్ ప్రశ్నించాడు. పహల్గామ్ ఘటన పునరావృతం కాకుండా చూడగలరా? ఆప్తులను కోల్పోయిన వారి గాయాలు మానుతాయా? పర్యాటకులకు భద్రత ఉంటుందా లేక అది రాజకీయ నాయకులకే పరిమితమా? వీటన్నిటికీ సమాధానం అవును అయితే, శాంతికి అర్థం ఉంటుందని అని ప్రశ్నల వర్షం కురిపించాడు. భారత్‌లో న్యాయం ఎప్పటికీ జరగదని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మోదీ కూడా విఫలమయ్యారని, కాబట్టి భవిష్యత్తులో ఎవరి నుంచి ఏమీ ఆశించలేమని నిరాశ వ్యక్తం చేశాడు. అయితే, మరికొందరు మాత్రం ఈ కాల్పుల విరమణను స్వాగతించారు. 
Narendra Modi
India-Pakistan ceasefire
Pulwama attack
Netizens reactions
Social media
Yogi Adityanath
Political criticism
Ceasefire agreement
Pakistan
International relations

More Telugu News