Counterfeit Liquor Deaths: అమృత్‌సర్‌లో ఘోరం: కల్తీ మద్యం తాగి 15 మంది కూలీల మృతి

15 Workers Dead After Drinking Spurious Liquor in Amritsar
  • మృతుల్లో ఎక్కువ మంది ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులే
  • ప్రధాన నిందితుడు ప్రభ్‌జిత్ సింగ్‌ సహా ఐదుగురి అరెస్ట్
  • గతంలోనూ పంజాబ్‌లో కల్తీ మద్యం మరణాలు
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మజీఠా ప్రాంతంలోని నాలుగు గ్రామాలలో కల్తీ మద్యం సేవించి 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. మృతులలో అత్యధికులు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులేనని, భంగాలీ, మరారీ కలాన్ థెర్వాల్, పాతల్‌పురి గ్రామాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు ప్రభ్‌జిత్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అమృత్‌సర్ రూరల్ పోలీసులు వెల్లడించారు. కల్తీ మద్యం సరఫరా వెనుక ప్రభ్‌జిత్ సింగ్‌ సూత్రధారి అని తేలిందన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభ్‌జిత్ సింగ్‌ సోదరుడు కుల్బీర్ సింగ్ అలియాస్ జగ్గూ, సాహిబ్ సింగ్ అలియాస్ సరాయ్, గుర్జంత్ సింగ్, జీతా భార్య నిందర్ కౌర్‌లను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధితులందరూ ఆదివారం సాయంత్రం ఒకే షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు సోమవారమే మరణించగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ఆలస్యంగా ఈ మరణాల గురించి సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

పంజాబ్‌లో కల్తీ మద్యం మరణాలు ఇదే మొదటిసారి కాదు. మార్చి 2024లో సంగ్రూర్‌లో 24 మంది, 2020లో రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా కల్తీ మద్యానికి బలయ్యారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన 'యుధ్ నశియాన్ విరుధ్' కార్యక్రమం సోమవారంతో 72 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 6,280 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 10,444 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
Counterfeit Liquor Deaths
Prabhjit Singh
Amritsar
Punjab
India
Illegal Alcohol
Bootleg Liquor
Majitha
Kulbir Singh
Drug Smuggling

More Telugu News