Indigo Airlines: కోల్‌కతా విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Bomb Threat at Kolkata Airport Indigo Flight Disrupted
  • 195 మంది ప్రయాణికులతో ముంబై వెళ్లాల్సిన విమానం
  • అధికారులు అప్రమత్తం, విమానం క్షుణ్ణంగా తనిఖీ
  • దొరకని అనుమానాస్పద వస్తువులు... నకిలీ ఫోన్ కాల్‌గా నిర్ధారణ
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో విమానాశ్రయం పరిసరాల్లో కొద్దిసేపు తీవ్ర గందరగోళం, ఆందోళనకర వాతావరణం నెలకొంది.

ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు కోల్‌కతా నుంచి ముంబైకి ఇండిగో విమానం బయలుదేరాల్సి
ఉంది. మొత్తం 195 మంది ప్రయాణికులు చెక్-ఇన్ పూర్తి చేసుకున్నారు. ఈ తరుణంలో, విమానాశ్రయ అధికారులకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి విమానంలో బాంబు అమర్చినట్లు చెప్పాడు. విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ బెదిరింపు రావడంతో అధికారులు తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టారు.

వెంటనే ప్రయాణికులు, లగేజీని విమానం నుంచి కిందకు దించివేశారు. విమానాన్ని ప్రయాణికులు లేని సురక్షితమైన 'ఐసోలేషన్ బే' ప్రాంతానికి తరలించారు. బాంబు నిర్వీర్య దళాలు, ఇతర భద్రతా బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదు. దీంతో అదంతా బూటకపు బెదిరింపు అని తేలడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి, సీఐఎస్‌ఎఫ్ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.
Indigo Airlines
Kolkata Airport
Bomb Threat
Netaji Subhas Chandra Bose International Airport

More Telugu News