Danujay Reddy: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు హాజరైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి

AP Liquor Scam Danujay Reddy Krishna Mohan Reddy Appear Before SIT
  • ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దర్యాప్తు ముమ్మరం
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ముందుకు వచ్చిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
  • ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నట్లుగా భావిస్తున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బుధవారం నాడు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, తమ న్యాయవాది మన్మధరావుతో కలిసి సిట్ అధికారుల ముందుకొచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) మరియు జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. వీరి ప్రమేయం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నతాధికారులను కలవడం కష్టసాధ్యంగా ఉండేదని, నియోజకవర్గాల్లో పనులు జరగాలంటే వీరి ఆమోదం తప్పనిసరి ప్రచారం జరిగింది.

ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అరెస్ట్ అనంతరం సిట్ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య, దిలీప్‌లతో పాటు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం నాడు ఈ కేసుతో సంబంధమున్న గోవిందప్ప బాలాజీని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసి, విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గోవిందప్ప బాలాజీ కోర్టు విచారణ కొనసాగుతున్న తరుణంలోనే, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అనూహ్యంగా సిట్ కార్యాలయానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వీరిద్దరినీ అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, వారు తమ పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే, వారు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, మే 16వ తేదీ వరకు వారిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచిస్తూనే, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే వారు నేడు విచారణకు హాజరయ్యారు.

న్యాయవాది సమక్షంలో వీరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మద్యం పాలసీ రూపకల్పన ఎలా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ మొత్తం నడిచింది, కీలక నిర్ణయాలు ఎక్కడి నుంచి వెలువడ్డాయి వంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ అధికారులకు ఎలాంటి సమాచారం అందిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వీరిద్దరూ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారించే అవకాశాలున్నాయి.
Danujay Reddy
Krishna Mohan Reddy
AP Liquor Scam
SIT Investigation
Vijayawada
Supreme Court
Jagan Mohan Reddy
YSRCP
Casireddy Rajasekhar Reddy
AP Politics

More Telugu News