Chandrababu Naidu: అక్టోబర్ 2 నాటికి చెత్త లేని పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

Andhra Pradesh to be Waste Free by October 2nd CM Chandrababu Naidu
  • స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ తోడ్పడాలన్న సీఎం చంద్రబాబు
  • రాయలసీమలో ఫ్యాక్షనిజానికి ఇకపై తావులేదని వెల్లడి
  • సీమకు పరిశ్రమలు తెచ్చి, ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ
స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌ను సందర్శించి రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పలు కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ప్రకటించారు. 

నెట్‌ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గత ప్రభుత్వం పట్టణాల్లోనే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసి పోయిందని, అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో చెత్త లేకుండా చేయమని మంత్రి నారాయణకు చెప్పానని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకూ 55 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించారని, రోడ్డుపై చిన్న కాగితం ముక్క కూడా వేయకుండా బాధ్యతగా వ్యవహరించే దేశం జపాన్... మనమూ దీన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాయలసీమలో ఫ్యాక్షన్‌కు తావులేదు, పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కూకటివేళ్లతో పెకిలించామని గుర్తుచేసిన చంద్రబాబు, భవిష్యత్తులో కూడా సీమ గడ్డపై ఫ్యాక్షన్ అనే మాటే వినిపించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని హరిత ఇంధన కేంద్రంగా (గ్రీన్ ఎనర్జీ హబ్) తీర్చిదిద్దుతామని, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సీమను కేంద్రంగా మారుస్తామని తెలిపారు.

ఓర్వకల్లు, కొప్పర్తిలో రూ.5 వేల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు కానుందని వెల్లడించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు గేమ్ ఛేంజర్ అవుతుందని, లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు అనేక పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. సీమలోని నాలుగు జిల్లాల్లో విమానాశ్రయాలు, జాతీయ రహదారుల అనుసంధానం తమ ప్రభుత్వ చొరవతోనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు.

స్వచ్ఛాంధ్ర – పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని, మన ఇల్లు, పరిసరాలతో పాటు పల్లెలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం సూచించారు. వ్యర్థాల పునర్వినియోగం (రీసైక్లింగ్) ప్రాముఖ్యతను వివరించారు. 

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ఏర్పాటు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామాల్లో ప్రజా చైతన్యం తీసుకురావాలని, చెత్త సేకరణ, కంపోస్ట్ తయారీ బాధ్యతలను వారికి అప్పగిస్తామని చెప్పారు. 

'పల్లె పుష్కరిణి' కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చెరువులను శుభ్రపరిచి, వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తామన్నారు. 2026 మార్చి నాటికి రాష్ట్రాన్ని వంద శాతం ఓడీఎఫ్ ప్లస్‌గా మార్చడమే లక్ష్యమన్నారు.


Chandrababu Naidu
Andhra Pradesh
Swachh Andhra
Waste Management
Cleanliness Drive
Rayalaseema Development
Green Energy Hub
Pollution Control
Urban Development
Rural Development

More Telugu News