Vishal: తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేసిన విశాల్, సాయి ధన్సిక... ఎప్పుడంటే...!

Vishal and Sai Dhansika Announce Wedding Date
  • వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న హీరో విశాల్, నటి సాయి ధన్సిక 
  • ఆగస్టు 29న వీరి వివాహం జరగనున్నట్లు వెల్లడి
  • ఇది కచ్చితంగా ప్రేమ వివాహమేనని స్పష్టం చేసిన విశాల్
  • వివాహం తర్వాత కూడా సాయి ధన్సిక నటనను కొనసాగిస్తుందని తెలిపిన విశాల్
  • చెన్నైలో జరిగిన ఓ సినిమా కార్యక్రమం వేదికగా ఈ ప్రకటన
కోలీవుడ్ హీరో విశాల్, నటి సాయి ధన్సిక త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కొద్ది రోజులుగా వీరి పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ, ఈ జంట తమ వివాహ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, పెళ్లి తేదీని కూడా అభిమానులతో పంచుకుంది.

చెన్నైలో సోమవారం జరిగిన ఓ సినిమా కార్యక్రమానికి హాజరైన విశాల్, సాయి ధన్సిక ఈ శుభవార్తను వెల్లడించారు. తమ వివాహం ఆగస్టు 29న జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, "సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తుంది" అని స్పష్టం చేశారు. సాయి ధన్సిక మాట్లాడుతూ, "కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని తన మనసులోని మాటను పంచుకున్నారు.

గతంలో విశాల్ పెళ్లి గురించి పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ, 'నడిగర్ సంఘం' భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ భవనం పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, "త్వరలోనే పెళ్లి చేసుకుంటా. నా జీవిత భాగస్వామిని కనుగొన్నాను. ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది తప్పకుండా ప్రేమ వివాహమే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తా" అని హింట్ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇవాళ  పెళ్లి కబురు అందరితో పంచుకున్నారు. 

సాయి ధన్సిక నటించిన 'యోగీ దా' అనే యాక్షన్ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారనే వార్త బయటకు రావడంతో వీరి పెళ్లిపై ప్రచారం మరింత ఊపందుకుంది. అనుకున్నట్లుగానే, అదే వేదికపై నుంచి విశాల్-ధన్సిక తమ పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించి, అభిమానులకు ఆనందాన్ని పంచారు. సాయి ధన్సిక, రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, 'షికారు', 'అంతిమ తీర్పు', 'దక్షిణ' వంటి తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
Vishal
Vishal marriage
Sai Dhansika
Vishal Sai Dhansika wedding
Kollywood actor
Tamil actress
Kabali movie
Yogi Da movie
Telugu movies
Love marriage

More Telugu News