Siddaramaiah: నేను కన్నడలో మాట్లాడను... హిందీలోనే మాట్లాడతా... బ్యాంకు మేనేజర్ తీరు వివాదాస్పదం

Siddaramaiah Reacts to SBI Manager Refusing Kannada Hindi Dispute
  • కర్ణాటక ఎస్‌బీఐలో కస్టమర్‌తో కన్నడలో మాట్లాడనన్న మహిళా అధికారిణి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్, హిందీ రుద్దుతున్నారంటూ విమర్శలు
  • వెల్లువెత్తిన నిరసనలతో అధికారిణి కన్నడలో క్షమాపణ
  • ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీవ్ర ఆగ్రహం
  • అధికారిణి బదిలీ, బ్యాంకు సిబ్బందికి భాషా శిక్షణ ఇవ్వాలని సూచన
కర్ణాటకలో ఓ ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక భాష అయిన కన్నడలో మాట్లాడటానికి నిరాకరించడమే కాకుండా, కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, సదరు బ్యాంకు మేనేజర్ చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు, ఆమెను ఎస్‌బీఐ అధికారులు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా తీవ్రంగా స్పందించారు.

అనేకల్ తాలూకాలోని సూర్య నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్, అక్కడి బ్రాంచ్ మేనేజర్ ను కన్నడలో మాట్లాడాలని కోరారు. అయితే, ఆ మేనేజర్ అందుకు నిరాకరించారు. "ఇది కర్ణాటక మేడమ్, దయచేసి కన్నడలో మాట్లాడండి" అని కస్టమర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆమె పెడచెవిన పెట్టారు. "ఇది ఇండియా" అంటూ బదులిచ్చిన అధికారిణి, "నేను మీ కోసం కన్నడ మాట్లాడను… నేను హిందీలోనే మాట్లాడతాను" అని స్పష్టం చేశారు. వాగ్వాదం తీవ్రం కావడంతో, ఆ బ్రాంచ్ మేనేజర్"నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ సంభాషణ మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. బ్యాంకు మేనేజర్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందీని బలవంతంగా రుద్దడమేనని, స్థానిక భాషను అగౌరవపరచడమేనని మండిపడ్డారు. కస్టమర్లతో అమర్యాదగా ప్రవర్తించారని, ఆర్‌బీఐ మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. "కన్నడ భాషను అవమానించిన అధికారిణిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి" అని పలువురు డిమాండ్ చేశారు.

విమర్శలు వెల్లువెత్తడంతో, ఎస్‌బీఐ అధికారులు స్పందించారు. సదరు మహిళా అధికారిణి తన సహోద్యోగి సహాయంతో కన్నడలో క్షమాపణ చెబుతున్న వీడియోను విడుదల చేశారు. "నా ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఇకపై కన్నడలోనే కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తాను" అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర స్పందన

ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. "అనేకల్ తాలూకా, సూర్య నగరలోని ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ (అధికారిణి) కన్నడ, ఇంగ్లీషులో మాట్లాడటానికి నిరాకరించి, పౌరులను అగౌరవపరిచిన తీరు తీవ్రంగా ఖండించదగినది" అని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు. సదరు అధికారిణిని బదిలీ చేస్తూ ఎస్‌బీఐ తీసుకున్న చర్యను ప్రస్తావించిన సీఎం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.


Siddaramaiah
Karnataka
SBI Bank
Kannada Language
Bank Manager Controversy
Hindi Language
Anekal
Surya Nagar
Language Dispute
Customer Service

More Telugu News