KTR: కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందన

KTR Reacts to Notices Issued to KCR on Kaleshwaram Project
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో కేసీఆర్ కు నోటీసులు
  • ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే నోటీసులని కేటీఆర్ విమర్శ
  • కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని ధ్వజం
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఇది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమని సంచలన ఆరోపణలు చేశారు.

దిక్కుతోచని స్థితిలోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత 17 నెలలుగా పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనుమరుగై, కమీషన్ల రాజ్యం నడుస్తోందని విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే స్వయంగా కమీషన్లు లేనిదే పనులు జరగడం లేదని చెబుతున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు" అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను, నల్గొండలో సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం బాధితులకు సహాయం అందించడంలో, ఘటనలపై స్పందించడంలో విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. "కమీషన్ల మీద ఉన్న ఆరాటం, సహాయక చర్యలపై కూడా చూపలేకపోయారు. మృతదేహాలను వెలికితీయడానికి కూడా సాహసం చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది" అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని నోటీసులు ఇచ్చినా, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. "మీరు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? తులం బంగారం, నాలుగు వేల రూపాయల పింఛన్ల హామీ ఏమైంది? వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం" అని అన్నారు. చట్టాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఎప్పటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తాయని, నిజాయతీ ఓడిపోదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నోటీసులు కేవలం చిల్లర ప్రయత్నాలని, దూదిపింజల్లా ఎగిరిపోతాయని కేటీఆర్ తేలిగ్గా కొట్టిపారేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, త్వరలోనే వారిని తిరస్కరించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
KTR
KTR comments
Kaleshwaram Project
KCR
BRS Party
Telangana Politics
PC Ghosh Commission
Congress Government
Corruption allegations
Telangana development

More Telugu News