YS Jagan Mohan Reddy: చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు

YS Jagan Alleges Corruption Debt Under Chandrababu One Year Rule
  • ఏడాది కాలంలోనే చంద్రబాబు రూ.1.37 లక్షల కోట్ల అప్పు చేశారన్న జగన్
  • రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, సంక్షేమం కనుమరుగని విమర్శ
  • లిక్కర్, ఇసుక, మైనింగ్‌లో భారీగా మాఫియా నడుస్తోందని వ్యాఖ్య
  • ఈనాడు, కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జగన్
  • విద్యుత్ కొనుగోళ్లలోనూ పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపణ
తెలుగుదేశం ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 నెలల్లో రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల ఊబిలోకి నెట్టిందని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

సంక్షేమం గాలికి.. అటకెక్కిన అభివృద్ధి
ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మోసాలతో నింపేశారని జగన్ విమర్శించారు. "కాగ్ నివేదికను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు, సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలంలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా బాబు అనుకూల గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది" అని  ఆరోపించారు. తమ హయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించామని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించామని అన్నారు.

అప్పుల కుప్పగా మార్చారు 
చంద్రబాబును ‘అప్పుల సమ్రాట్’ గా అభివర్ణించిన జగన్.. కేవలం 12 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని ఆరోపించారు. "కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే, రాష్ట్ర రెవెన్యూలో కేవలం 3.8 శాతం మాత్రమే వృద్ధి ఉంది. మా ఐదేళ్ల పాలనలో రూ. 3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ. 1,37,546 కోట్ల అప్పు చేశారు. మేము ఐదేళ్లలో చేసిన అప్పును చంద్రబాబు ఏడాదిలోనే చేసి చూపించారు. అప్పులు తేవడంలోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు" అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాపై ధ్వజం 
కొన్ని మీడియా సంస్థల తీరుపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఒక మాఫియాలా తయారయ్యాయి. సెకీకి సన్మానం అంటూ ఈనాడు నా ఫోటోతో ఒక కథనం ప్రచురించింది. వాస్తవానికి 2021 డిసెంబర్‌లో ఏపీతో సెకీ ఒప్పందం జరిగితే, ఆ తర్వాత రెండేళ్లకు సెకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ, ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోంది. ఈనాడు పేపర్‌ను టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ, టిష్యూ పేపర్‌కు తక్కువగా చూడాలి. ‘దున్నపోతు ఈనితే.. దూడను కట్టేసినట్లు’ ఉంది ఈనాడు తీరు. మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

స్కాములకు అడ్డాగా రాష్ట్రం 
రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా వంటి అన్ని రంగాల్లో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జగన్ ఆరోపించారు. "మైనింగ్ నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మా హయాంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం, రాష్ట్ర ఖర్చు తగ్గించాం. ఇప్పుడు విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది" అని ఆయన వివరించారు. ఉర్సా అనే సంస్థకు బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని, అమరావతి పేరుతో దోపిడీ స్కాములకు పరాకాష్టగా నిలిచిందని జగన్ ఆరోపించారు. తాము కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని, తమ యుద్ధం చంద్రబాబుతోనే కాకుండా, చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా అని ఆయన వ్యాఖ్యానించారు.
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
corruption allegations
debt
YS Jagan
TDP government
Andhra Jyothy
Eenadu
TV5

More Telugu News