YS Jagan: 53 లక్షల చ.అ. విస్తీర్ణంతో సచివాలయం అవసరమా?: జగన్

YS Jagan Questions Need for 53 Lakh Sq Ft Secretariat in AP
  • అమరావతిలో కొత్త సచివాలయ నిర్మాణంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
  • 53 లక్షల చదరపు అడుగుల భారీ నిర్మాణం అవసరమా అని ప్రశ్న
  • ప్రస్తుతం 6 లక్షల చ.అ. విస్తీర్ణంలోనే సచివాలయం, అసెంబ్లీ ఉన్నాయని వెల్లడి
  • 12 వేల మంది సిబ్బందికి ఇంత విస్తీర్ణం ఎందుకని నిలదీత
  • కాంట్రాక్టులు, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ ప్రయత్నమని జగన్ ఆరోపణ
  • హైదరాబాద్‌లోని కేసీఆర్ సచివాలయం 8.58 లక్షల చ.అ. మాత్రమేనని పోలిక
అమరావతిలో తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు సరిపడా ఉన్నప్పటికీ, 53 లక్షల చదరపు అడుగుల పైచిలుకు విస్తీర్ణంతో కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏముందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనవసరపు వ్యయంతో పాటు, కాంట్రాక్టులు కట్టబెట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడానికే ఈ భారీ నిర్మాణాలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం ఆరు బ్లాకుల్లో సుమారు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాలు, సచివాలయంలోని సిబ్బంది మొత్తం కలిపినా 12 వేల మందికి మించి లేరని, వారంతా ఇప్పటికే ఉన్న 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు, కొత్తగా 53 లక్షల 57 వేల 389 చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఏముందని ఆయన నిలదీశారు. "సిబ్బంది సంఖ్య పెరగనప్పుడు, ఇంత భారీ విస్తీర్ణం ఎందుకు? ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోవా?" అని జగన్ ప్రశ్నించారు.

అమరావతిలో నిరంతరం కాంట్రాక్టులు కొనసాగాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారని జగన్ ఆరోపించారు. "నిరంతరం కాంట్రాక్టులు ఉండాలి, నిరంతరం పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం వాళ్లు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్లు డబ్బులు ఈయనకి ఇస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలన్నదే వారి ఆలోచన" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన నూతన సచివాలయం కూడా అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాలతో కలిపి 8 లక్షల 58 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉందని జగన్ పోల్చి చెప్పారు. అంతకంటే చాలా రెట్లు అధిక విస్తీర్ణంలో ఏపీలో సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన అన్నారు. కేవలం అమరావతిని ఇలాగే కొనసాగించాలని, తద్వారా నిరంతరాయంగా కాంట్రాక్టులు పొందుతూ, ఆర్థిక లబ్ధి పొందాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.
YS Jagan
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Secretariat
Amaravati
New Secretariat Building
Chandrababu Naidu
Government Contracts
AP Politics
Secretariat Construction
Building Area

More Telugu News