Chandrababu Naidu: ఢిల్లీ పయనమైన సీఎం చంద్రబాబు... కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

Chandrababu Naidu Busy in Delhi Meetings with Central Ministers
  • ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు
  • ఇవాళ రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ
  • రేపు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
  • రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు
  • ఎల్లుండి నీతి ఆయోగ్ భేటీలో పాల్గొననున్న సీఎం
  • 24న రాత్రి కుప్పం పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు హస్తిన బాట పట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు.

ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ముఖ్యంగా నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుపై కేంద్ర హోంమంత్రి నిర్వహించే సమీక్షలో కూడా చంద్రబాబు పాల్గొంటారని సమాచారం.

రేపటి షెడ్యూల్ కూడా  బిజీగా ఉండనుంది. ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్రానికి అవసరమైన సహకారంపై చర్చిస్తారు. అనంతరం 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో భేటీ అవుతారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో, సాయంత్రం 3 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశాలలో మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై దృష్టి సారించనున్నారు. రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 24వ తేదీన (ఎల్లుండి) ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి, నేరుగా బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు నుంచి కుప్పం వెళ్లి, ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు, అనగా 25వ తేదీన ఆయన అమరావతికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. 
Chandrababu Naidu
Andhra Pradesh
Amit Shah
Delhi
Central Ministers
Nirmala Sitharaman
Prahlad Joshi
Rajnath Singh
CR Patil
Ashwini Vaishnaw

More Telugu News