Kamal Haasan: థగ్ లైఫ్' నాయకుడు కంటే పెద్ద హిట్ అవుతుంది.. ఇది నా ప్రామిస్: కమల్ హాసన్

Kamal Haasan Promises Thug Life Bigger Hit Than Nayagan
  • దర్శకుడిగా మణిరత్నం మరోసారి ఆశ్చర్యపరుస్తారన్న కమల్
  • తాను ఇంకా విద్యార్థినే, నిత్యం నేర్చుకుంటూనే ఉంటానన్న విశ్వనటుడు
  • జూన్ 5న 'థగ్ లైఫ్' విడుదల, శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా తెలుగులో రిలీజ్
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణిరత్నం కలయికలో ముప్పై ఏడేళ్ల తర్వాత రూపుదిద్దుకుంటున్న చిత్రం 'థగ్ లైఫ్'. ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్రిష, శింబు, అభిరామి, నాజర్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమల్ హాసన్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

కమల్ మాట్లాడుతూ..."'నాయకుడు' సినిమాతో మణిరత్నం గారు అందరినీ ఎలా ఆశ్చర్యపరిచారో, 'థగ్ లైఫ్'తో కూడా ప్రేక్షకులను అదే విధంగా అబ్బురపరచబోతున్నారు. నన్ను ద్రోణాచార్యునితో పోల్చారు కానీ నేను ద్రోణాచార్యుడ్ని కాదు, నేను ఇంకా విద్యార్థినే. ఒకరికి నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మణిరత్నం గారి సినిమాలో నేను నటించను, కేవలం ఆ పాత్రలా ప్రవర్తిస్తాను (బిహేవ్ చేస్తాను). మేమంతా సినిమా అభిమానులం, సినిమాను ఎప్పుడూ భుజాలపై మోస్తాం" అని అన్నారు.

తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, "నాజర్ గారు ఆల్‌రౌండర్. మేమిద్దరం ఎప్పటినుంచో కలిసి ప్రయాణం చేస్తున్నాం. 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాకి తనికెళ్ల భరణి గారు రాయాల్సింది, కానీ అది కుదరలేదు. ఆయనతో కలిసి మరింత ప్రయాణం చేయాలని, ఆయన ఇంకా ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను. శింబు చిన్నప్పటి నుంచి నేను తన సినిమాలు చూస్తున్నాను. నేను కూడా బాలనటుడిగానే ప్రస్థానం మొదలుపెట్టాను, అందుకే మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఏదైనా సినిమానే మాకు నేర్పింది. అందుకే నన్ను నేను ఒక సినిమా విద్యార్థిగానే చెప్పుకుంటాను," అని తెలిపారు.

'థగ్ లైఫ్' గురించి మాట్లాడుతూ, "నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. 'థగ్ లైఫ్' కూడా మనసుపెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన బృందంతో చేసిన సినిమా. ఇలాంటి గొప్ప సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా 'నాయకుడు' కంటే పెద్ద విజయం సాధిస్తుంది, ఇది నా ప్రామిస్. ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ నుంచి ఉన్న ఉత్సాహం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను తెలుగులోనే స్టార్‌గా ఎదిగాను. స్టార్‌గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. జూన్ 5న సినిమా వస్తోంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా వేడుక చేసుకుందాం" అని కమల్ హాసన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

Kamal Haasan
Thug Life
Mani Ratnam
Nayagan
Trisha
Simbu
Abhirami
Telugu Cinema
Gangster Drama
Tamil Movie

More Telugu News