Kamal Haasan: కమల్ లో ఏ మార్పు లేదు: మణిరత్నం

Kamal Haasan Unchanged Says Mani Ratnam
  • కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్
  • నేడు హైదరాబాద్ లో చిత్రబృందం ప్రెస్ మీట్
  • హాజరైన కమల్ హాసన్, మణిరత్నం తదితరులు
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణిరత్నం కలయికలో వస్తున్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష, శింబు వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సంచలనం సృష్టించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డికి చెందిన శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది.

దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, "కమల్ హాసన్ గారితో 'నాయకుడు' సినిమా చేశాను. 'మౌనరాగం' పూర్తయ్యాక నిర్మాత ముక్తా శ్రీనివాసన్ గారు ఒక హిందీ సినిమా క్యాసెట్ ఇచ్చి తమిళంలో రీమేక్ చేయమన్నారు. నాకు రీమేక్‌పై ఆసక్తి లేదని చెప్పాను. ఇదే మాట కమల్ గారికి చెప్పమన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇదే విషయం చెప్పగా, 'నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ సినిమా చేద్దాం' అన్నారు. అలా 'నాయకుడు' మొదలైంది. 'థగ్ లైఫ్' కూడా ఇలాగే మొదలైంది. కమల్ గారే ఫోన్ చేసి ఇద్దరం కలిసి సినిమా చేద్దామని చెప్పారు. ఆయనతో ఇన్నేళ్ల తర్వాత రెండో సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం. 'నాయకుడు' సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆయనలో ఏ మార్పు లేదు. దర్శకుడికి ఏం కావాలో అర్థం చేసుకుని సహకరించే హీరో కమల్," అని కొనియాడారు.

శింబు మాట్లాడుతూ, "తెలుగు ప్రేక్షకులు నాకు చాలా ప్రత్యేకం. నా కెరీర్ ఆరంభంలో 'మన్మథ' సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో పాట పాడటం ఒక కల నెరవేరినట్లే. మణిరత్నం గారి క్రమశిక్షణ, సమయపాలన అద్భుతం. కమల్ గారితో పనిచేయడం గొప్ప అనుభవం," అన్నారు.

సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ, "ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన భావన కలుగుతుంది. అత్యుత్తమ ప్రతిభావంతులు కలిసి చేసిన ఈ సినిమా ప్రేక్షకులపై ప్రేమతో తీసింది. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. జూన్ 5 కోసం ఒక ప్రేక్షకురాలిగా ఎదురుచూస్తున్నాను," అని తెలిపారు.

త్రిష మాట్లాడుతూ, "హైదరాబాద్ నాకు రెండో ఇల్లు. ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. 'నాయకుడు' సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు మణిరత్నం, కమల్ హాసన్ గార్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది," అన్నారు.

అభిరామి మాట్లాడుతూ, "మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఆదరణ వేరే స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా నాకు ఒక కలల ప్రాజెక్ట్. మణిరత్నం, కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్, శింబు వంటి దిగ్గజాలతో పనిచేయడం ఒక కల. ఈ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, ఒక యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లి వచ్చినట్లుంది," అన్నారు.

నాజర్ మాట్లాడుతూ, "ప్రపంచంలోనే గొప్ప నటుడు కమల్ హాసన్. భారతీయ సినిమాను మార్చిన దర్శకుడు మణిరత్నం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్.. ఇలాంటి అద్భుతమైన బృందంతో పనిచేయడం ఒక కల. 38 ఏళ్ల తర్వాత కమల్ గారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఈ సినిమా అంచనాలను అందుకుని, పెద్ద విజయం సాధిస్తుంది," అని ఆశాభావం వ్యక్తం చేశారు.

తనికెళ్ల భరణి, అశోక్ సెల్వన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, "ఈ సినిమాను నాకు ఇచ్చినందుకు కమల్ గారికి, మహేందర్ గారికి ధన్యవాదాలు. గతంలో నేను విడుదల చేసిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ట్రైలర్, పాటలు చూశాక ఈ సినిమా మెగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. కమల్ గారి కెరీర్‌లోనే ఇది అతిపెద్ద హిట్‌గా నిలుస్తుంది," అన్నారు.
Kamal Haasan
Thug Life
Mani Ratnam
Trisha
Simbu
AR Rahman
Nassar
Telugu cinema
Tamil movie
Gangster drama

More Telugu News