Jyoti Malhotra: తవ్వేకొద్డీ వెలుగు చూస్తున్న నిజాలు... జ్యోతిని స్పాన్పర్ చేసిన సంస్థకు అజర్ బైజాన్ తో ఒప్పందం!

Jyoti Malhotra links to Azerbaijan firm emerge
  • యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్
  • మూడుసార్లు పాక్ పర్యటన
  • జ్యోతి ప్రయాణాలకు స్పాన్సర్ చేసిన వెగో కంపెనీ
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (33) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హర్యానా పోలీసుల అదుపులో ఉన్న ఆమెపై పలు కీలక ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్‌పై ఆమెకున్న అభిమానం, అక్కడి ఏజెంట్లతో సంబంధాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

జ్యోతి మల్హోత్రా మూడుసార్లు పాకిస్థాన్ వెళ్లారని, అక్కడ పలువురు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను కలిశారని విచారణలో తేలింది. అంతేకాకుండా, ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ అనే ఉద్యోగితో కూడా జ్యోతికి పరిచయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. తన యూట్యూబ్ వీడియోల ద్వారా పాకిస్థాన్ అనుకూలమైన కథనాలను ప్రచారం చేసేందుకు ఆమె ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. 

ఈ కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూఏఈకి చెందిన ట్రావెల్ కంపెనీ 'వెగో'తో జ్యోతి మల్హోత్రాకు సంబంధాలున్నట్లు తేలింది. జ్యోతి తరచూ చేసే ప్రయాణాలకు ఈ కంపెనీనే ఆర్ధిక సహాయం చేసినట్లు సమాచారం. కాగా, ఈ వెగో కంపెనీ రెండు రోజుల క్రితం అజర్‌బైజాన్ టూరిజం బోర్డుతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రాకు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెగో సంస్థ, ఇప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన అజర్‌ బైజాన్‌తో ఒప్పందం చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాకిస్థాన్ గూఢచర్యానికి, లేదా నిధుల బదిలీకి వెగో కంపెనీకి ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఆధారాలు లభించనప్పటికీ, జ్యోతి మల్హోత్రా ఉదంతం నేపథ్యంలో ఈ సంస్థ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

వెగో కంపెనీ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉండగా, దుబాయ్, బెంగళూరు, జకర్తాలలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రయాణికులకు విమానయాన సంస్థలు, హోటళ్లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ధరలను పోల్చి చూపేందుకు వీలుగా రూపొందించిన ట్రావెల్ మెటాసెర్చ్ ఇంజన్‌గా ఈ సంస్థ పనిచేస్తోంది. జ్యోతి మల్హోత్రా కేసులో వెగో కంపెనీ పాత్రపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 
Jyoti Malhotra
Pakistan
espionage
Azerbaijan
VeeGo
UAE
travel company
intelligence agency
India
Youtube

More Telugu News