Aishwarya Rai: ఆత్మవిశ్వాసంతో కేన్స్ వేదికపై మెరిసిన ఐశ్వర్య రాయ్

Aishwarya Rai Responds to Body Shaming Comments at Cannes
  • కేన్స్ ఫెస్టివల్‌లో నుదుట సిందూరంతో మెరిసిన ఐశ్వర్య రాయ్
  • బనారస్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా ఐశ్వర్య
  • బరువు పెరగడంపై విమర్శలను పట్టించుకోని వైనం
ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ చలనచిత్రోత్సవాల్లో భారతీయ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి తనదైన ముద్ర వేశారు. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, ఈసారి ఆమె శరీర బరువుపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయినప్పటికీ, ఐశ్వర్య ఎప్పటిలాగే ఆత్మవిశ్వాసంతో కనిపించారు.

ఈ వేడుకలో ఐశ్వర్య రాయ్ అద్భుతమైన ఐవరీ రంగు బెనారసీ చీరలో దర్శనమిచ్చారు. దానికి జతగా పొడవాటి దుపట్టాను ధరించారు. మెడలో చోకర్, రెండు వరుసల వజ్రాల హారం, ప్రత్యేకంగా నిలిచిన ఓ పెద్ద రూబీ లాకెట్ ఆమె అందాన్ని మరింత పెంచాయి. పాపిటలో నిండుగా పెట్టుకున్న సిందూరం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వస్త్రధారణలో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే, అందరి దృష్టి ఆమెపైనే కేంద్రీకృతమైంది. శరీర బరువుపై వస్తున్న కామెంట్లను ఏమాత్రం పట్టించుకోకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె కనిపించడం విశేషం.

ఐశ్వర్య రాయ్ తన శరీర బరువు విషయంలో విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె శరీర ఆకృతిపై పలువురు ట్రోల్ చేశారు. అప్పట్లో డేవిడ్ ఫ్రాస్ట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఐశ్వర్య స్పందించారు. గర్భం దాల్చడం, ప్రసవం తర్వాత శరీరంలో మార్పులు రావడం, బరువు పెరగడం చాలా సహజమని, తన శరీరం స్పందించిన తీరు పట్ల తాను సౌకర్యంగానే ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.

అదే ఇంటర్వ్యూలో, శరీర బరువులో మార్పులు వచ్చినప్పటికీ, తాను ఆత్మవిశ్వాసంతో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఐశ్వర్య తెలిపారు. బరువు తగ్గడానికి హడావిడి పడకుండా, తన జీవితాన్ని తాను జీవిస్తూ, బిడ్డ ఆలనాపాలన చూసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చానని, ఇతరుల అభిప్రాయాలు, విమర్శలు తనను ప్రభావితం చేయలేదని ఆమె వివరించారు. 
Aishwarya Rai
Aishwarya Rai Bachchan
Cannes Film Festival
body shaming
weight gain
Aaradhya Bachchan

More Telugu News