Chandrababu Naidu: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ

Chandrababu Naidu Meets Central Minister Prahlad Joshi
  • రాష్ట్రానికి రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం కేటాయించాలని విజ్ఞప్తి
  • సమావేశం ఫలప్రదమైందని ఏపీ ముఖ్యమంత్రి ట్వీట్
  • ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు
  • 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యమని ప్రకటన
ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌కు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ప్రతిపాదనలు అందించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం ఫలప్రదమైందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నివాసాల్లో సౌర వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు.

రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ యూనిట్లను పెద్ద ఎత్తున నెలకొల్పడం ద్వారా ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించడంతో పాటు, పర్యావరణ హితమైన ఇంధనాన్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో 10 వేల యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన తరగతుల (బీసీ) వినియోగదారులకు సబ్సిడీపై రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం పాల్గొన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Prahlad Joshi
Rooftop Solar Power
PM Surya Ghar Muft Bijli Yojana
Renewable Energy
Ram Mohan Naidu
Pemmasani Chandrasekhar
AP Government

More Telugu News