YS Jagan Mohan Reddy: లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: ఆదినారాయణరెడ్డి

Adinarayana Reddy Predicts Jail for YS Jagan in Liquor Scam
  • జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులే రాష్ట్ర దుస్థితికి కారణమని విమర్శ
  • వైసీపీ కనుమరుగవడం తథ్యమని బీజేపీ ఎమ్మెల్యే జోస్యం
  • కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళతారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా, లిక్కర్ స్కాం ఆరోపణలపైనా జగన్ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన అన్నారు.

జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నాయని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని ఆయన తెలిపారు.

లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకు వెళ్లడం, చిప్పకూడు తినడం తప్పదని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇదే కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే జగన్ రోజూ మీడియా ముందుకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా, లిక్కర్ స్కాం ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం పేరిట ప్రభుత్వం బేతాళ కథలు చెబుతోందని, అక్రమ కేసులు బనాయించి, అరెస్టులతో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ నుంచి ఇసుక వరకు ప్రతీ విషయంలోనూ అవినీతి జరుగుతోందని, ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు.

YS Jagan Mohan Reddy
Andhra Pradesh
Liquor Scam
Adinarayana Reddy
BJP
YS Avinash Reddy
Corruption
Andhra Pradesh Politics
TDP
Political News

More Telugu News