Paritala Sriram: నాలోని ఒరిజినల్ అలాగే ఉంది... ఎవరూ డీలా పడొద్దు: పరిటాల శ్రీరామ్

Paritala Sriram Comments at Dharmavaram TDP Mini Mahanadu
  • ధర్మవరం మినీ మహానాడులో శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు
  • కార్యకర్తలు బయపడొద్దని వ్యాఖ్య
  • ఇంకా నాలుగేళ్ల సమయం ఉందన్న శ్రీరామ్
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆ పార్టీ నేత, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పరోక్షంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. "యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర చేయి ఆయుధం అవుతుంది" అని ఆయన అన్నారు. "సమయం మించి పోలేదు, ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది" అని పేర్కొంటూ, భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేశారు. "ధర్మవరం నాకు చాలా ఓపిక నేర్పింది. కానీ, నాలో ఉన్న ఒరిజనల్ అలానే ఉంది" అంటూ తన సహజశైలి మారలేదని స్పష్టం చేశారు.

కార్యకర్తలు నిరాశ చెందవద్దని సూచిస్తూ, "పొద్దు మునగాలంటేనే సమయం పడుతుంది. ఎందుకు మీరు డీలా పడిపోతున్నారు?" అని ప్రశ్నించారు. "మీరు తప్పు చేసినా, ఒప్పు చేసినా మీ వెంటే ఉంటాను. నా వెంట నడిచి వచ్చిన వారిని ఎవర్నీ మర్చిపోలేదు" అంటూ వారికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ఎవరికీ భయపడకుండా ధైర్యంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ దిశగా నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేశారు కూడా. అయితే, ఎన్నికల పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యకుమార్ యాదవ్ విజయం సాధించి, ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ధర్మవరం మినీ మహానాడులో పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన మాటల్లోని అంతరార్థాలపై స్థానిక రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
Paritala Sriram
Dharmavaram
Telugu Desam Party
TDP
Mini Mahanadu
Andhra Pradesh Politics
AP Elections
Satya Kumar Yadav
BJP
Political Speech

More Telugu News