Rishad Premji: విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వేతనం రెట్టింపు

Rishad Premji Wipro Chairman Salary Doubled
  • విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీకి రూ.13.7 కోట్ల వార్షిక వేతనం
  • గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం
  • కంపెనీ లాభాలు పెరగడంతో పారితోషికంలో పెరుగుదల
  • కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.53.64 కోట్ల ప్యాకేజీ
  • మాజీ సీఈఓ డెలాపోర్టే వేతనం రూ.168 కోట్లతో పోలిస్తే పల్లియాకు తక్కువే
దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) రూ.13.7 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) పారితోషికంగా అందుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు కావడం విశేషం. కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడటంతో ఆయన వేతనంలో ఈ పెరుగుదల కనిపించింది.

2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విప్రో విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)లో రిషద్ ప్రేమ్‌జీ కేవలం రూ.6.4 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. ఆ సమయంలో కంపెనీ లాభాలు తగ్గడంతో ఆయన ఎలాంటి కమీషన్ తీసుకోకపోవడమే కాకుండా, తన జీతభత్యాల్లో స్వచ్ఛందంగా 20 శాతం కోత కూడా విధించుకున్నారు.

అయితే, గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో విప్రో నికర లాభంలో 18.9 శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.13,135 కోట్లు ఆర్జించింది. ఈ సానుకూల ఫలితాల నేపథ్యంలో రిషద్ ప్రేమ్‌జీ పారితోషికం రూ.6.4 కోట్ల నుంచి రూ.13.7 కోట్లకు పెరిగింది. ఈ సమాచారాన్ని విప్రో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో కూడా పొందుపరిచింది.

ఇదిలా ఉండగా, విప్రో మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే స్థానంలో ఇటీవల సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా గత ఆర్థిక సంవత్సరంలో రూ.53.64 కోట్లు (6.2 మిలియన్ డాలర్లు) పారితోషికంగా అందుకున్నారు. ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కంటే పల్లియా వేతనం అధికంగా ఉన్నప్పటికీ, అంతకుముందు సీఈఓగా ఉన్న థియరీ డెలాపోర్టే 2023-24 ఆర్థిక సంవత్సరానికి అందుకున్న రూ.168 కోట్ల పారితోషికంతో పోలిస్తే పల్లియా వేతనం దాదాపు సగానికన్నా తక్కువే.

శ్రీనివాస్ పల్లియా అందుకున్న రూ.53.64 కోట్ల పారితోషికంలో 1.7 మిలియన్ డాలర్లు వేతనం, అలవెన్సుల రూపంలో రాగా, మరో 1.7 మిలియన్ డాలర్లు కమీషన్/వేరియబుల్ పేగా అందింది. మిగిలిన 2.8 మిలియన్ డాలర్లు ఇతర చెల్లింపుల కింద లెక్క చూపారు. కంపెనీ మొత్తం లాభాల్లో 0.35 శాతం చొప్పున రిషద్ ప్రేమ్‌జీ, శ్రీనివాస్ పల్లియా కమీషన్ రూపంలో అందుకున్నట్లు నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను పల్లియాకు అదనంగా 16,77,202 స్టాక్ ఆప్షన్లు కేటాయించగా, రిషద్ ప్రేమ్‌జీకి ఎలాంటి స్టాక్ ఆప్షన్లు జారీ చేయలేదని కంపెనీ స్పష్టం చేసింది.
Rishad Premji
Wipro
Wipro Chairman
Srinivas Pallia
Thierry Delaporte
IT Services

More Telugu News