Jagan: ఈ దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది: జగన్

Jagan Slams AP Police Action as Undeclared Emergency
  • వైసీపీ నేత కుమారుడిపై పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డారన్న జగన్
  • థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆరోపణ
  • చంద్రబాబు శిశుపాలుడి మాదిరి తప్పులు చేస్తున్నాడంటూ ట్వీట్
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోందని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్ప‌డ‌డం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? అని మండిపడ్డారు.

"స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్ లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా?" అని నిలదీశారు. 

"చంద్రబాబు గారూ.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళతాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం" అని జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా జగన్ పంచుకున్నారు.
Jagan
YS Jagan
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
Dachepalli
Harikrishna
Police brutality
TDP
Chandrababu Naidu
YSRCP

More Telugu News