Amazon Employee: కంపెనీ తీసేస్తానంటోంది.. మేనేజర్ రిజైన్ చేయమంటోంది.. సోషల్ మీడియాలో ఉద్యోగి పోస్టు వైరల్

Amazon Employee Shares Layoff Advice From Manager on Reddit
  • అమెజాన్ ఉద్యోగిని త్వరలో తొలగిస్తామని తెలిపిన మేనేజర్
  • ముందే రాజీనామా చేస్తే నోటీస్ పీరియడ్ డబ్బులిస్తామని సూచన
  • వార్షిక బోనస్‌పై ఆందోళనతో రెడ్డిట్‌లో సలహా కోరిన ఉద్యోగి
  • రాజీనామా చేయవద్దని, అది కంపెనీ ఎత్తుగడ అని పలువురి అభిప్రాయం
"వచ్చే వారం మిమ్మల్ని తొలగిస్తూ హెచ్ఆర్ నుంచి ఆదేశాలు వస్తాయి. ఈ లోపే రాజీనామా చేస్తే నోటీస్ పీరియడ్ డబ్బులు ఇప్పిస్తా" అని అమెజాన్ మేనేజర్ ఒకరు తన సబార్డినేట్ కు సలహా ఇచ్చారు. ఏటా అందుకునే వార్షిక బోనస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ వార్త తనను పిడుగులా తాకిందంటూ సదరు ఉద్యోగి వాపోయారు. కంపెనీ తొలగించే వరకు వేచి చూడాలా, మేనేజర్ చెప్పినట్టు రాజీనామా చేయాలా.. ఏంచేయమంటారు అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో సలహా కోరాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎక్కువమంది మాత్రం రిజైన్ చేయవద్దని, కంపెనీ తొలగిస్తేనే చట్టపరంగా దక్కాల్సిన ప్రయోజనాలు అందుతాయని సూచిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. అమెజాన్‌లో లెవెల్ 3 ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు ఇటీవల తన మేనేజర్‌తో మాట్లాడారు. "ఈ శుక్రవారం లేదా వచ్చే వారంలోగా హెచ్‌ఆర్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంది. కాబట్టి, మీరు స్వయంగా రాజీనామా చేయడమే మంచిది. ఈ రోజే మీతో రాజీనామా చేయించాలని నాకు ఆదేశాలు అందాయి" అని మేనేజర్ చెప్పినట్లు సదరు ఉద్యోగి తన రెడ్డిట్ పోస్టులో పేర్కొన్నాడు.

ముందే రాజీనామా చేస్తే, నోటీస్ పీరియడ్ లో పనిచేయాల్సిన అవసరం లేకుండా ఆ కాలానికి సంబంధించిన డబ్బులు చెల్లిస్తామని మేనేజర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగి తెలిపారు. అయితే, "ప్రతి సంవత్సరం మే నెలలో మాకు వార్షిక బోనస్ వస్తుంది. ఇప్పుడు రాజీనామా చేస్తే ఆ బోనస్ రాదేమోనని భయంగా ఉంది" అని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశాడు. "మేనేజర్ సూచనను పాటించవద్దని ఓ స్నేహితుడు సలహా ఇచ్చాడు. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఉద్యోగంలో నుంచి తొలగించి, భవిష్యత్తులో కంపెనీలో చేరే అవకాశం లేకుండా బ్లాక్‌లిస్ట్ చేస్తామని మేనేజర్ అంటున్నారు" అని చెప్పాడు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు రాజీనామా చేయమని సూచించగా, చాలా మంది మాత్రం అందుకు వ్యతిరేకంగా సలహాలిచ్చారు. "రాజీనామా చేస్తే నోటీస్ పీరియడ్ డబ్బులు ఇవ్వాల్సిన చట్టపరమైన బాధ్యత కంపెనీకి ఉండదు. అదే కంపెనీ తొలగిస్తే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. మీ మేనేజర్ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు" అని మరో నెటిజన్ సూచించారు. మరికొందరు మాత్రం, అందుబాటులో ఉన్న సెలవులు వాడుకుంటూ కొత్త ఉద్యోగం వెతుక్కోవాలని, రాజీనామా మాత్రం చేయవద్దని సలహా ఇచ్చారు. మొత్తంగా, ఈ వ్యవహారం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను, కార్పొరేట్ సంస్థల వైఖరిని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది.
Amazon Employee
Amazon Layoffs
Layoff Advice
Job Security
Employee Rights
Notice Period
Annual Bonus
HR Policies
Job Loss
Reddit Post

More Telugu News