KTR: బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లతో దందాలు.. ఢిల్లీ పెద్దలకు చందాలు..రేవంత్ పాలనపై మండిపడ్డ కేటీఆర్

KTR Slams Revanth Reddy Over Corruption Allegations
  • ఓటుకు నోటు కుంభకోణం ఎవరూ మర్చిపోలేదన్న మాజీ మంత్రి
  • కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణ
  • శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్
తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి దోచిపెడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన ‘బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లతో దందాలు.. ఢిల్లీ పెద్దలకు చందాలు’ అన్న చందంగా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు మూటల మనిషి అని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని, అది నిజమని తాజాగా తేలిందని చెప్పారు.

ఢిల్లీకి మూటలు మోసి పదవులు కొనుక్కున్నాడని, పీసీసీ చీఫ్ పదవి కోసం రూ.50 కోట్లు చెల్లించాడని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి గతంలో ఆరోపించారని కేటీఆర్ గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కేటీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే పదవి నుంచి తప్పుకోవాలని ఇదే కాంగ్రెస్ లీడర్లు కర్ణాటకలో డిమాండ్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

కాంగ్రెస్ డిమాండ్లకు స్పందించిన యడియూరప్ప అప్పట్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఆయన సూచనల మేరకే ‘యంగ్ ఇండియన్’ కంపెనీకి డొనేషన్లు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఈడీ వెల్లడించిందన్నారు. రేవంత్ సూచనతో, నెల రోజుల వ్యవధిలో యంగ్ ఇండియన్ కంపెనీకి రూ.80 లక్షల వరకు బదిలీ చేసినట్లు ఈడీ ఆరోపించిందన్నారు.

ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దర్యాప్తు నిష్ఫక్షపాతంగా జరగాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని కేటీఆర్ చెప్పారు. ఈ కేసు తర్వాత రేవంత్ రెడ్డి మారిపోయాడని తాము భావించామన్నారు. అయితే, కుక్క తోక వంకర, దానిని ఎవరూ సరిచేయలేరన్నట్లు ఆయన మారలేదని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
BRS
Telangana
National Herald Case
Corruption
ED Investigation
Young Indian
Komati Reddy

More Telugu News