Rahul Gandhi: రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్

Rahul Gandhi Non Bailable Warrant Issued in Defamation Case
  • పరువునష్టం కేసులో జారీ చేసిన జార్ఖండ్ చైబాసా కోర్టు
  • జూన్ 26న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
  • 2018 లో అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
  • ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసిన బీజేపీ నేత
లోక్ సభ ప్రతిపక్ష నేత, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్‌లోని చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018 నాటి పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ ఇచ్చింది. జూన్ 26న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

రాహుల్ పై కేసు ఇదే..
2018లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. "హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీకి అధ్యక్షుడు కాగలడు" అని రాహుల్ వాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలందరినీ అవమానించేలా ఉన్నాయని, పరువు నష్టం కలిగించాయని ఆరోపిస్తూ బీజేపీ నేత ప్రతాప్ కతియార్ 2018 జులై 9న చైబాసా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తదనంతర కాలంలో, జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పరువు నష్టం కేసును 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ కేసు చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన మేజిస్ట్రేట్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు.

కోర్టుకు హాజరు కాని రాహుల్..
కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ విచారణకు హాజరుకాలేదు. దీంతో తొలుత ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్‌పై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను 2024 మార్చి 20న హైకోర్టు కొట్టివేసింది. అనంతరం, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రత్యేక న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, జూన్ 26న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Rahul Gandhi
Defamation case
Jharkhand court
Amit Shah
BJP
Congress
Non-bailable warrant
MP MLA court
Chaibasa
Pratap Katiyar

More Telugu News