Vijayasai Reddy: జగన్ కు కౌంటర్ ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంపై విజయసాయిరెడ్డి స్పందన

Vijayasai Reddy Clarifies on Viral Statement Against Jagan
  • జగన్ వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చినట్టుగా వైరల్ అవుతున్న ప్రకటన
  • జగన్ కు తాను కౌంటర్ ఇవ్వలేదన్న విజయసాయి
  • సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వెల్లడి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో ఓ పత్రికా ప్రకటన వైరల్ కావడం కలకలం రేపింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా విజయసాయిరెడ్డి ఈ ప్రకటన విడుదల చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఆ ప్రకటన తాను విడుదల చేయలేదని విజయసాయిరెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.

విజయసాయిరెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సీటును చంద్రబాబు నాయుడుకు అమ్ముకున్నారని రెండు రోజుల క్రితం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు ఓ పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. "నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అధికారం వచ్చాక నువ్వే మారావు" అంటూ జగన్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆ నకిలీ ప్రకటనలో ఉంది. అంతేకాకుండా, "వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఎక్కడా లొంగలేదు, ప్రలోభాలకు ఆశపడలేదు" అని విజయసాయిరెడ్డి అన్నట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రకటనపై విజయసాయిరెడ్డి ఈరోజు స్పందించారు. తన పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలోని కొందరు మిత్రుల ద్వారా తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. "ఆ ప్రకటన నాది కాదు. నేను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి. గమనించగలరు" అని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా వర్గాలు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో, ఈ నకిలీ ప్రకటన వ్యవహారానికి తెరపడినట్లయింది. 
Vijayasai Reddy
YS Jaganmohan Reddy
YSRCP
fake news
social media
press release
Chandrababu Naidu
Rajya Sabha
political news
Andhra Pradesh politics

More Telugu News