Mysore Pak: మైసూర్ 'పాక్' పేరు చిచ్చు: 'పాక్' పేరు తీసేయడంపై రాయల్ కుక్ మునిమనవడి అభ్యంతరం

Mysore Pak Name Change Sparks Controversy Royal Cooks Great Grandson Object
  • మైసూర్ పాక్ పేరును 'మైసూర్ శ్రీ'గా మార్చిన వైనం
  • జైపూర్‌లోని స్వీట్ షాపులో 'పాక్' పదం తొలగింపు
  • దేశభక్తితోనే మార్చామని దుకాణ యజమాని వెల్లడి
  • ఇది పూర్వీకుల ఆవిష్కరణను అవమానించడమేనన్న సృష్టికర్త మునిమనవడు
  • కన్నడలో 'పాక' అంటే చక్కెర పాకం అని అర్థమంటూ స్పష్టత
  • ఇతర స్వీట్ల పేర్ల నుంచీ 'పాక్' తొలగింపు
ప్రముఖ మిఠాయి "మైసూర్ పాక్" పేరులోని "పాక్" పదాన్ని తొలగించి, దాని స్థానంలో "శ్రీ" అని చేర్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ వంటి ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ పేరు మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక ప్రముఖ మిఠాయి దుకాణం తమ వద్ద విక్రయించే మైసూర్ పాక్ పేరును 'మైసూర్ శ్రీ'గా మార్చింది. మైసూర్ పాక్ మాత్రమే కాకుండా, మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ వంటి ఇతర మిఠాయిల పేర్ల చివర ఉన్న 'పాక్' పదాన్ని కూడా తొలగించి, వాటి స్థానంలో 'శ్రీ'ని చేర్చారు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్‌లను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చారు. ఈ మార్పునకు గల కారణాన్ని దుకాణ యజమాని అంజలీ జైన్ వివరిస్తూ, "దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లోనే కాదు, ప్రతి పౌరుడిలోనూ ఉండాలి. 'పాక్' అనే పదం పాకిస్థాన్‌ను గుర్తుకు తెస్తున్నందున, ఆ పదాన్ని తొలగించాలని నిర్ణయించాం. 'శ్రీ' అనే పదం శుభసూచకం, అందుకే దాన్ని చేర్చాం" అని తెలిపారు.

వారసుడి అభ్యంతరం

మైసూర్ పాక్ సృష్టికర్తగా పేరుగాంచిన కకాసుర మడప్ప మునిమనవడు ఎస్. నటరాజ్ ఈ పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కకాసుర మడప్ప ఒకప్పుడు మైసూర్ వడయార్ రాజకుటుంబానికి వంటవాడిగా ఉండేవారని, ఆయనే ఈ ప్రసిద్ధ స్వీట్‌ను తొలిసారిగా తయారుచేశారని చెబుతారు.

పేరు మార్పు విషయంపై నటరాజ్ మాట్లాడుతూ, "దానిని మైసూర్‌పాక్ అనే పిలవండి. మన పూర్వీకులు అందించిన ఆవిష్కరణకు మరో పేరు పెట్టడం సరికాదు. కన్నడలో 'పాక' అంటే చక్కెర లేదా బెల్లంతో చేసే తీపి పదార్థం అని అర్థం. దీనిని మైసూర్‌లో తొలిసారి తయారు చేయడం వల్లే మైసూర్‌పాక్ అని పేరు వచ్చింది. దీనికి వేరే అర్థాలు తీయడం అనవసరం" అని ఆయన ఒక ఆంగ్ల మీడియాతో అన్నారు.
Mysore Pak
Mysore Pak name change
Kakusura Madappa
Mysore sweet
Indian sweets

More Telugu News