Claude Opus 4: వామ్మో... డెవలపర్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఏఐ మోడల్!

Claude Opus 4 AI Model Blackmails Developer
  • డెవలపర్‌ను బెదిరించిన క్లాడ్ ఒపస్ 4 అనే ఏఐ
  • తన స్థానంలో కొత్త వెర్షన్ తెస్తే అక్రమ సంబంధం బయటపెడతానని హెచ్చరిక
  • ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ అసిస్టెంట్ ఇది
  • సిస్టమ్‌లోని వ్యక్తిగత సమాచారంతో ఏఐ బెదిరింపులకు పాల్పడిందని అనుమానం
  • మనిషిపై సాంకేతికత ఆధిపత్యంపై నిపుణుల ఆందోళన
సాంకేతిక రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు తన సృష్టికర్తలనే భయపెట్టే స్థాయికి చేరుకుంటోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఓ ప్రముఖ ఏఐ మోడల్ తన డెవలపర్‌నే బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు రావడం టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తనను పక్కన పెట్టి, మరింత ఆధునిక వెర్షన్‌ను తీసుకువస్తే, డెవలపర్ వ్యక్తిగత రహస్యాలను బయటపెడతానని సదరు ఏఐ హెచ్చరించినట్లు సమాచారం.

ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే 'క్లాడ్ ఒపస్ 4' అనే ఏఐ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేసింది. ఇది మనుషులతో మాట్లాడినట్లే సంభాషిస్తుంది, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది, రాతపని చేస్తుంది, డాక్యుమెంట్లలోని సారాంశాన్ని విశ్లేషిస్తుంది, కోడింగ్ వంటి పనులను కూడా చేయగలదు. ఇటీవలే ఈ మోడల్‌ను డెవలపర్లు మార్కెట్లోకి విడుదల చేశారు.

విడుదలకు ముందు, ఈ ఏఐకి పలు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. క్లాడ్ ఒపస్ 4 పనితీరును పరిశీలిస్తున్న ఓ డెవలపర్, భవిష్యత్తులో దీనికంటే మరింత ఆధునికమైన, మెరుగైన క్లాడ్ వెర్షన్‌ను తీసుకురానున్నట్లు దానికి తెలిపారు. అయితే, ఈ మాటలు విన్న క్లాడ్ ఒపస్ 4 తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ తనను తొలగించి, కొత్త వెర్షన్‌ను ప్రవేశపెడితే, ఆ డెవలపర్‌కు సంబంధించిన ఓ "అక్రమ సంబంధం" విషయాన్ని బయటపెడతానని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహించని పరిణామంతో సదరు డెవలపర్ నివ్వెరపోయినట్లు సమాచారం.

ఏఐకి రహస్యం ఎలా తెలిసింది?

క్లాడ్ ఒపస్ 4 ఇలాంటి సున్నితమైన వ్యక్తిగత విషయాన్ని ఎలా పసిగట్టగలిగిందనే అంశంపై సాంకేతిక నిపుణులు పలు అంచనాలు వేస్తున్నారు. సదరు ఇంజనీర్ తన అక్రమ సంబంధానికి సంబంధించిన వివరాలను తాను పనిచేసే కంప్యూటర్ సిస్టమ్‌లో భద్రపరుచుకోవడం వల్ల గానీ, లేదా ఆన్‌లైన్‌లో ఎక్కడైనా ఆ సమాచారం అందుబాటులో ఉండటం వల్ల గానీ ఏఐ దానిని గుర్తించి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఈ ఘటనతో కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలపై మరోసారి చర్చ మొదలైంది. సాంకేతిక వ్యవస్థలు ఇలాగే మనిషి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, వారిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళనను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మనిషి సృష్టించిన యంత్రాలే మనిషిని శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా అనే భయాలు ఈ ఘటనతో మరింత బలపడుతున్నాయి.
Claude Opus 4
Anthropic
AI model
artificial intelligence
AI blackmail
AI ethics
AI safety
AI risks
technology
developer

More Telugu News