Saranya Pradeep: శరణ్య ప్రదీప్ సందడి ఏది?

- 'ఫిదా'తో ఎంట్రీ ఇచ్చిన శరణ్య ప్రదీప్
- ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం
- సహజమైన నటన ప్రత్యేకమైన ఆకర్షణ
- కొన్ని నెలలుగా తెరపై కనిపించని బ్యూటీ
సాధారణంగా వెండితెరపై హీరోయిన్స్ చేసే గ్లామర్ సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. అందువలన ఆడియన్స్ వాళ్లను గుర్తుపెట్టుకుంటారు గానీ, అక్క .. చెల్లి .. వదిన .. పాత్రలను చేసేవారిని పెద్దగా గుర్తుపెట్టుకోరు. కేరక్టర్ ఆర్టిస్టుల జాబితాలో కనిపించే చాలా తక్కువ మందికి మాత్రమే ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది. అలాంటివారి జాబితాలో శరణ్య ప్రదీప్ పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది.
'ఫిదా' సినిమాలో సాయిపల్లవి సిస్టర్ పాత్రలో, తొలిసారిగా ఆమె తెరపై మెరిసింది. ఈ సినిమా చూసినవాళ్లు, సాయిపల్లవి నటనకి మంచి మార్కులు ఇచ్చినప్పటికీ .. ఆమె సిస్టర్ రోల్ చేసిన అమ్మాయి ఎవరోగానీ .. చక్కని కనుముక్కు తీరుతో ఆకట్టుకుందని చెప్పుకున్నారు. ఆ కారణంగానే ఆ తరువాత ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోయింది. నటనలో సహజత్వం .. డైలాగ్ డెలివరీ .. ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఆమెను ఆడియన్స్ కి చేరువ చేస్తూ వెళ్లాయి.
అయితే క్రితం ఏడాది శరణ్య ప్రదీప్ నాలుగు సినిమాలు చేసింది. 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' .. 'భామా కలాపం 2' ఆమెకి మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో శరణ్య ప్రదీప్ తన స్పీడ్ పెంచుతుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. 'క' సినిమా తరువాత ఆమె కనిపించలేదనే చెప్పాలి. చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో తెలియదు గానీ, ఈ ఏడాదిలో ఇంతవరకూ మాత్రం ఆమె సందడి కనిపించలేదనే చెప్పాలి.

