Rishabh Pant: పంత్ విధ్వంసక సెంచరీ... ఆర్సీబీకి లక్నో భారీ సవాల్!

Rishabh Pant Century Lucknow Sets Huge Target for RCB
  • ఐపీఎల్ 2025 సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
  • లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ అజేయ శతకం (61 బంతుల్లో 118*)
  • మిచెల్ మార్ష్ దూకుడు (37 బంతుల్లో 67 పరుగులు)
ఐపీఎల్ 2025 సీజన్‌ చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) భారీ స్కోరు సాధించింది. లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల కొండంత స్కోరును ఆర్సీబీ ముందుంచింది. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే (14; 12 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) 25 పరుగుల వద్ద నువాన్ తుషార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్‌తో కలిసి మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా పంత్ తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మార్ష్ కూడా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు ఏకంగా 152 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ భాగస్వామ్యాన్ని భువనేశ్వర్ కుమార్ విడదీశాడు. దూకుడుగా ఆడుతున్న మార్ష్‌ను జితేష్ శర్మ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేర్చాడు.

అనంతరం వచ్చిన నికోలస్ పూరన్ (13; 10 బంతుల్లో, 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేదు. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో యశ్ దయాళ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, మరో ఎండ్‌లో రిషభ్ పంత్ తన ప్రతాపాన్ని కొనసాగించాడు. పంత్ కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో అజేయంగా 118 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ (1 నాటౌట్) ఒక పరుగు తీయడంతో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది.

ఆర్సీబీ బౌలర్లలో నువాన్ తుషార 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాళ్ 3 ఓవర్లలో 44 పరుగులు ఇవ్వగా, సుయాశ్ శర్మ 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చాడు. కృనాల్ పాండ్యా 2 ఓవర్లలో 14 పరుగులిచ్చాడు. 

కాగా, సెంచరీ పూర్తయిన అనంతరం పంత్ బ్యాట్, హెల్మెట్ పక్కనపెట్టి ఓ పల్టీ కొట్టడం అందరినీ ఆకట్టుకుంది.
Rishabh Pant
IPL 2025
Lucknow Super Giants
Royal Challengers Bangalore
RCB vs LSG
Mitchell Marsh
Jitesh Sharma
Nuwan Thushara
Cricket
T20

More Telugu News