Jayesh Ranjan: మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్.. వెయ్యిమంది సామాన్యులకు ఆహ్వానం

Miss World 2025 Finals Hyderabad Details by Jayesh Ranjan
  • హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి 2025 ఫైనల్స్
  • వచ్చే ఆదివారం హైటెక్స్‌లో తుది ఘట్టం
  • 120 దేశాల్లో సోనీ టీవీలో లైవ్ టెలికాస్ట్
  • తెలంగాణ సంస్కృతి, పర్యాటకంపై గంట ప్రచారం
  • సీఎం, మంత్రులు, సినీ ప్రముఖుల హాజరు
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ 2025 పోటీల తుది ఘట్టం నగరంలోని హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, ఇప్పటికే నాలుగు ఖండాలకు చెందిన 40 దేశాల నుంచి ప్రతినిధుల ఎంపిక పూర్తయింది. వచ్చే ఆదివారం సాయంత్రం జరిగే ఈ ఫైనల్స్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుది పోటీలు హైటెక్స్‌లోని హాల్ నంబర్ 4లో జరుగుతాయని తెలిపారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:20 గంటలకు ముగిసే ఈ కార్యక్రమానికి సుమారు 3500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం హైటెక్స్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జయేశ్ రంజన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ అంతర్జాతీయ వేడుకలో కేవలం ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు 7500 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో దాదాపు వెయ్యి మందికి అవకాశం కల్పించనున్నట్లు జయేశ్ రంజన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఫైనల్స్‌కు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్లు మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, బుధ, గురువారాల్లో కూడా ఇవి కొనసాగుతాయని జయేశ్ రంజన్ వెల్లడించారు. పూర్తిస్థాయి రిహార్సల్స్ మే 30, 31 తేదీల్లో ఉదయం జరుగుతాయని తెలిపారు. ఈ తుది పోటీలను సోనీ టీవీ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందని, ఈ ప్రసార సమయంలో దాదాపు 50 నుంచి 60 నిమిషాల పాటు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చూపిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, తుది పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఎవరు వ్యవహరిస్తారనే వివరాలను మిస్ వరల్డ్ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని జయేశ్ రంజన్ తెలిపారు.
Jayesh Ranjan
Miss World 2025
Hyderabad
Telangana Tourism
Miss World Finals
HITECH City
Revanth Reddy
Bollywood
Tollywood

More Telugu News