Kamal Haasan: క్షమాపణ చెప్పకుంటే కమల్ సినిమాలు నిషేధించాలి: కర్ణాటక మంత్రి సీరియస్ వార్నింగ్

Kamal Haasan Movie Ban Threat in Karnataka Over Language Remarks
  • "తమిళమే కన్నడకు జన్మనిచ్చింది" అన్న కమల్ హాసన్
  • వ్యాఖ్యలపై కర్ణాటకలో కన్నడ సంఘాల తీవ్ర నిరసన
  • క్షమాపణ చెప్పకుంటే సినిమాలు బ్యాన్ చేస్తామన్న కర్ణాటక మంత్రి
  • బెళగావి, మైసూరు, బెంగళూరులో కమల్ పోస్టర్ల దహనం
ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర దుమార రేపుతున్నాయి. "తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలను రాష్ట్రంలో నిషేధిస్తామని కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి హెచ్చరించారు.

చెన్నైలో ఇటీవల జరిగిన తన రాబోయే చిత్రం 'థగ్ లైఫ్' ఆడియో విడుదల కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, "తమిళమే కన్నడకు జన్మనిచ్చింది" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి తీవ్రంగా స్పందించారు.

"కమల్ హాసన్ కన్నడిగుల గురించి అనుచితంగా మాట్లాడారు. ఇది కన్నడిగులు సహించరు. ఆయన క్షమాపణ చెప్పాలి. లేదంటే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ కు లేఖ రాస్తాను. ఈరోజే చెబుతున్నాను. ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇందులో మరో మాటకు తావులేదు. లేదంటే ఆయన సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా చూస్తాం" అని తంగడగి స్పష్టం చేశారు.

కమల్ హాసన్ వ్యాఖ్యలతో కర్ణాటక వ్యాప్తంగా పలు కన్నడ అనుకూల సంఘాలు ఆందోళనలకు దిగాయి. బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కమల్ హాసన్‌ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కన్నడ భాషకు వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఆగ్రహంతో కొన్నిచోట్ల కమల్ హాసన్ పోస్టర్లను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమల్ హాసన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన నటిస్తున్న 'థగ్ లైఫ్' సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.
Kamal Haasan
Karnataka
Kannada
Tamil
Thug Life
Shivraj Tangadagi
Kannada Language

More Telugu News