Muccharla Srinivas: విజయవాడలో బంగారు బిస్కెట్ల స్కీం పేరుతో రూ. 10 కోట్ల మోసం!

10 Crore Gold Fraud Uncovered in Vijayawada involving Srinivas
  • చీటీల తరహాలో బంగారం స్కీం ప్రవేశపెట్టిన వ్యాపారి  
  • సుమారు 65 మంది బాధితుల నుంచి కోట్లలో వసూలు
  • పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టిన బాధితులు
  •  నిందితుడి కోసం ప్రత్యేక బృందంతో పోలీసుల గాలింపు 
చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టి, పాడుకున్న వారికి బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు. విజయవాడలో జరిగిందీ ఘటన. అయోధ్యనగర్‌కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్‌ గతంలో పచ్చళ్ల వ్యాపారం చేస్తూ స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండటంతో అందరూ అతడిని నమ్మారు. గతంలో చీటీలు వేసి సక్రమంగా డబ్బులు చెల్లించడంతో మరింత విశ్వాసం చూరగొన్నాడు. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్‌ బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో తక్కువ ధరకే బంగారం అందిస్తానంటూ ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చాడు.

ఆ స్కీం ప్రకారం.. ఇందులో చేరిన సభ్యులు ప్రతినెలా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 5 గ్రాముల బంగారానికి సమానమైన సొమ్ము చెల్లించాలి. ఈ స్కీంలో మొత్తం 25 మంది ఉంటారు. ప్రతి నెలా పాట నిర్వహించి పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం బిస్కెట్ ఇస్తారు. అయితే, పాడుకున్న సభ్యుడు ఆ తర్వాతి నెల నుంచి అదనంగా మరో 3 గ్రాములకు సమానమైన సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 

దీనివల్ల మొదటి నెలలో పాట పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం లభిస్తే, రెండో నెలలో పాట పాడుకునేవారికి 128 గ్రాముల బంగారం, మూడో నెలలో 131 గ్రాముల బంగారం... ఇలా ప్రతినెలా దక్కే బంగారం పరిమాణం పెరుగుతూ వస్తుందని నమ్మించాడు. దీంతో, ఎక్కువ బంగారం వస్తుందనే ఆశతో చాలామంది సభ్యులు పాట పాడుకోకుండా తమ వాటా సొమ్మును శ్రీనివాస్‌ వద్దే జమ చేస్తూ వచ్చారు.  

బోర్డు తిప్పేసిన వ్యాపారి 
స్కీమ్‌ చివరి దశకు చేరుకోవడంతో సభ్యులకు పెద్ద మొత్తంలో బంగారం అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తనకు భారీ నష్టం వస్తుందని గ్రహించిన శ్రీనివాస్‌ బోర్డు తిప్పేసి పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తనకు రూ.కోటి విలువైన బంగారం ఇవ్వాల్సి ఉందని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన చలువాది లక్ష్మణుడు అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిన్న 65 మంది బాధితులు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. లక్ష్మణుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మోసం విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉండవచ్చని బాధితులు అంచనా వేస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు నాయక్‌ నేతృత్వంలోని పోలీసు బృందం నిందితుడు శ్రీనివాస్‌ కోసం గాలిస్తోంది. నిందితుడు పట్టుబడితేనే మోసం పూర్తి స్వరూపం, ఎంతమంది బాధితులున్నారు, వారికి ఎంత బంగారం లేదా డబ్బులు చెల్లించాలనే విషయాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
Muccharla Srinivas
Vijayawada gold scheme fraud
gold biscuits scheme
Ajit Singh Nagar
chit fund scam
gold investment fraud
Andhra Pradesh crime
financial fraud
police investigation

More Telugu News