Mohammad Kaif: అయ్యర్ విష‌యంలో బీసీసీఐ ద్వంద్వ‌ వైఖ‌రి.. మ‌హ్మ‌ద్ కైఫ్ మండిపాటు!

Mohammad Kaif Slams BCCI Over Shreyas Iyer Selection Bias
  • శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కావాల‌నే టెస్ట్ జ‌ట్టుకు ఎంపిక చేయ‌లేద‌న్న కైఫ్‌
  • ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా టీమ్‌లో సుద‌ర్శ‌న్‌కు చోటు
  • ఐపీఎల్‌తో పాటు దేశ‌వాళీలోనూ రాణిస్తున్న అయ్య‌ర్‌ను ఎందుకు తీసుకోర‌ని ప్ర‌శ్న‌
  • ఈ విష‌యంలో బీసీసీఐ ద్వంద్వ వైఖ‌రిపై మాజీ క్రికెట‌ర్ గుస్సా
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు టీమిండియా ప్లేయ‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కావాల‌నే ఎంపిక చేయ‌లేద‌ని మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ అన్నాడు. అస‌లు అత‌డు చేసిన త‌ప్పేంట‌ని కైఫ్‌ బీసీసీఐని ప్ర‌శ్నించాడు. బీసీసీఐ ద్వంద్వ వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టాడు. ఐపీఎల్‌లో రాణిస్తున్నాడ‌ని యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్‌ను జ‌ట్టులో తీసుకున్న‌ప్పుడు... అదే ఐపీఎల్‌లో అయ్య‌ర్ కూడా అద‌ర‌గొడుతున్నాడ‌ని, ఇంకా గ‌త కొంత‌కాలంగా భార‌త జ‌ట్టు త‌ర‌ఫున అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు. అలాంట‌ప్పుడు అయ్య‌ర్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం ఏంట‌ని మాజీ క్రికెట‌ర్ మండిప‌డ్డాడు. 

అయ్యర్ 2024-2025 రంజీ ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్‌లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్ గెల‌వ‌డంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అయ్యర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో 500 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్‌గాను ఆక‌ట్టుకున్నాడు. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)ను ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాడు. ఇంకా అత‌డు ఏం చేయాలి, ఎందుకు బీసీసీఐ ద్వంద్వ‌ వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తుందో అర్థం కావ‌డం లేదంటూ కైఫ్ ఫైర్ అయ్యాడు. 

"సాయి సుదర్శన్ ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ (679 పరుగులు చేశాడు)లో రాణిస్తుండ‌డంతో అతన్ని ఇంగ్లండ్ టూర్ కోసం టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో అయ్యర్ చాలా కాలంగా బాగా రాణిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను దాదాపు 550 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అతను అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 514 ర‌న్స్ చేశాడు. అటు కెప్టెన్సీలోనూ అద‌ర‌గొట్టాడు. మ‌రి అత‌డిని ఎందుకు టెస్టు జ‌ట్టులోకి తీసుకోరు. మీరు ఒక ఆటగాడికి వైట్-బాల్ ప్రమాణాలను పరిశీలిస్తున్నారు, మరొక ఆటగాడికి కాదు. ఇది ముమ్మాటికీ బీసీసీఐ ద్వంద్వ వైఖ‌రినే" అని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ అన్నాడు.

కాగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా శ్రేయ‌స్‌ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని అంగీకరించిన విష‌యం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి టెస్ట్ జట్టులో అతనికి చోటు క‌ల్పించ‌డం కుద‌ర‌లేద‌ని అన్నాడు. 


Mohammad Kaif
Shreyas Iyer
BCCI
Sai Sudharsan
England Test Series
IPL 2024
Ajit Agarkar
Indian Cricket Team
Punjab Kings
Champions Trophy

More Telugu News