Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి కోర్టులో ఊరటతో పాటు ఎదురుదెబ్బ

Vallabhaneni Vamsi remand extended court rejects police custody request
  • నకిలీ ఇళ్ల పట్టాల కేసు
  • వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
  • వంశీ రిమాండ్ జూన్ 12 వరకు పొడిగింపు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఈరోజు నూజివీడు కోర్టులో మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. వంశీని రెండోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ హనుమాన్ జంక్షన్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని విచారించినందున, మళ్లీ కస్టడీ అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఆ సమయంలో వంశీ అస్వస్థతకు గురవడంతో విచారణ సరిగా జరగలేదని పోలీసులు వాదించినప్పటికీ, కోర్టు అంగీకరించలేదు.

రిమాండ్ పొడిగింపు
అయితే, ఇదే కేసులో వంశీకి విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో, పోలీసులు ఆయనను వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం వంశీకి జూన్ 12 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు, అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వంశీ నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి వంశీ ముఖ్య అనుచరుడిగా భావిస్తున్న ఓలుపల్లి మోహన్ రంగాను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు రంగాను విజయవాడ జిల్లా జైలు నుంచి గన్నవరం ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. 
Vallabhaneni Vamsi
Nuzvid Court
Fake house pattas case
YSR Congress Party
Hanuman Junction Police
Remand extended
Olupalli Mohan Ranga
Illegal mining case
Andhra Pradesh politics

More Telugu News