Revanth Reddy: మోదీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తీవ్రంగా స్పందించిన కిషన్ రెడ్డి

Revanth Reddys comments on Modi spark controversy Kishan Reddy responds
  • పాక్‌తో యుద్ధ విరమణపై ప్రధాని మోదీని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నాయకుల తీవ్ర ఆగ్రహం
  • రఫేల్ గురించి మాట్లాడితే పిల్లలు నవ్వుతారని బీజేపీ వ్యాఖ్య
  • సైన్యాన్ని కించపరచడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందన్న కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పాకిస్థాన్‌తో యుద్ధ విరమణ, రఫేల్ యుద్ధ విమానాల అంశాలపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుబడుతూ తీవ్రంగా స్పందించారు.

నిన్న జరిగిన 'జైహింద్ సభ'లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, పాకిస్థాన్‌తో యుద్ధ విరమణ విషయంలో ప్రధాని మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. "దేశ ప్రజలు, వీర జవాన్లు పాకిస్థాన్‌ను అంతం చేయాలన్న పట్టుదలతో ఉండగా, వారి ఆవేశంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది" అని ఆయన అన్నారు. అంతేకాకుండా, "140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ తాకట్టు పెట్టారు" అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తీవ్రంగా స్పందించింది. "విమానం అంటే దిల్‌సుఖ్‌నగర్ రోడ్ పక్కన దొరికే బొమ్మ అనుకునే సీఎం రవ్వంత రెడ్డి గారు, మీరు రఫేల్ గురించి మాట్లాడితే ఒకటో తరగతి పిల్లవాడు కూడా నవ్వుతాడు" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వరకు మన సైన్యాన్ని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా ప్రశ్నించారని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. "కాంగ్రెస్ పార్టీకి మన శత్రువుల భాష మాట్లాడటం పరిపాటే" అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Revanth Reddy
Kishan Reddy
Narendra Modi
Telangana BJP
Rafale fighter jets

More Telugu News