Bhanu Prakash Reddy: జగన్ మళ్లీ సినిమా చూపిస్తా అంటున్నారు... ఇప్పటికే జనాలు జడుసుకున్నారు: భానుప్రకాశ్ రెడ్డి

Bhanu Prakash Reddy Criticizes Jagans Rule in Andhra Pradesh
  • 11 సీట్లు వచ్చినా జగన్ లో అహంకారం తగ్గలేదని భానుప్రకాశ్ ఫైర్
  • జగన్ పాలన ఒక హారర్ సినిమా అని విమర్శ
  • జగన్ అండ్ కో తప్పులకు చట్ట ప్రకారం శిక్ష ఉంటుందని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, జగన్ మళ్లీ సినిమా చూపిస్తానని అంటున్నారని, కానీ ఆయన చూపించిన హారర్ సినిమాకు రాష్ట్ర ప్రజలు ఇప్పటికే జడుసుకున్నారని ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ ఒక భయానక చిత్రాన్ని చూపించారని ఆయన వ్యాఖ్యానించారు.

"సిగ్గు లేకుండా మళ్లీ సినిమా చూపిస్తా అంటూ మాట్లాడుతున్నారు. గత ఐదేళ్లలో రాక్షస రాజ్యం నడిపారు. ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ జగన్ మోహన్ రెడ్డిలో అహంకారం ఏమాత్రం తగ్గలేదు" అని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ నేతలను బెదిరించే ధోరణి సరికాదని, జగన్ తాటాకు చప్పుళ్లకు ఏపీలో ఎవరూ భయపడరని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తాను ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్‌కు అర్థం కావడం లేదని, ఆయన సినిమా చూపిస్తానంటే చూసేందుకు ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, ఆయన శేష జీవితం పబ్జీ గేమ్ ఆడుకుంటూ, 70 ఎంఎం థియేటర్లలో సినిమాలు చూస్తూ గడపాల్సిందేనని సెటైర్లు వేశారు.

జగన్‌ను నమ్మి పలువురు ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని గుర్తుచేసిన భానుప్రకాశ్ రెడ్డి, తాను 16 నెలలు జైల్లో ఉన్న చోటికే ఆ అధికారులను కూడా తీసుకెళ్లాలని జగన్ కంకణం కట్టుకున్నట్లుగా ఉందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు.

వైసీపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఐదేళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. మట్టి, మద్యం వంటి అనేక అంశాల్లో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి మూలాలు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. "జగన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుని ప్రవర్తించారా?" అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా, గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
Bhanu Prakash Reddy
Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh
BJP
Corruption
TTD Board
AP Politics
Tadepalli Palace
IAS Officers

More Telugu News