Mahesh Kumar Goud: కవిత వాస్తవాలు బయటపెడుతున్నారు.. బండి సంజయ్‌ని తొలగించింది అందుకే: మహేశ్ కుమార్ గౌడ్

Kavitha Exposing Truths Bandi Sanjay Removed for That Reason Mahesh Kumar Goud
  • బీజేపీ, బీఆర్ఎస్ రహస్యంగా కుమ్మక్కయ్యాయని టీపీసీసీ చీఫ్ ఆరోపణ
  • బీఆర్ఎస్‌తో దోస్తీ కోసమే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని వ్యాఖ్య
  • శామీర్‌పేటలో ఈటల, హరీశ్‌రావు భేటీ అయి.. కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారని వెల్లడి
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందని, అందుకు అనుగుణంగానే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుల మధ్య రహస్య భేటీ జరిగిందంటూ ఆయన విమర్శించారు.

సర్జికల్ స్ట్రైక్స్‌ విషయంలో బీజేపీ వైఖరిని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. "కేవలం కొన్ని సర్జికల్ స్ట్రయిక్స్‌ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పట్లో ఇందిరా గాంధీ వందల కొద్దీ సర్జికల్ స్ట్రయిక్స్‌ చేసినా ఏనాడూ ప్రచారం చేసుకోలేదు" అని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ గొప్పతనాన్ని ఆనాటి ప్రతిపక్ష నేత వాజ్‌పేయి కూడా గుర్తించి 'అపర కాళీ' అని ప్రశంసించారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీకి, ప్రస్తుత ప్రధాని మోదీకి పోలికే లేదని ఆయన అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధాలు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. "బీజేపీ, బీఆర్ఎస్ సయోధ్య గురించి కవిత ఇప్పుడు వాస్తవాలు బయటపెడుతున్నారు. బీఆర్ఎస్‌తో దోస్తీకి అడ్డుగా ఉన్నందునే బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించింది నిజం కాదా?" అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ప్యాకేజీలు అందుతున్నాయని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగే చెబుతున్నారని, ఆయన మాటలకు బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

శామీర్‌పేటలోని ఒక ఫామ్‌హౌస్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్‌, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించారు. "ఆ ఇద్దరూ కలిసి కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈటల రాజేందర్ మోదీ పార్టీలో ఉన్నారా? లేక కేసీఆర్‌ పార్టీలో ఉన్నారా? తేల్చుకోవాలి. కాళేశ్వరం కుంభకోణం నుంచి బయటపడేందుకే ఈటల రాజేందర్ ఇప్పుడు కేసీఆర్‌తో చేతులు కలుపుతున్నారు" అని ఆయన ఆరోపించారు.
Mahesh Kumar Goud
TPCC
బీజేపీ
BRS alliance
Etela Rajender
Harish Rao
Kavitha
Bandi Sanjay

More Telugu News