Vijayasai Reddy: కోటరీ వల్ల పార్టీ వదిలానే కానీ, జగన్ కు హాని కలిగే విధంగా మాట్లాడడం జరగదు: విజయసాయి

Vijayasai Reddy Denies Speaking Against Jagan After Leaving YSRCP
  • జగన్‌కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని విజయసాయిరెడ్డి స్పష్టీకరణ
  • తిరుపతి, వైజాగ్‌లో వ్యాఖ్యలు చేశానన్నది అవాస్తవం అని వెల్లడి
  • ప్రస్తుతం రాజకీయాల్లో లేను, ఏ పార్టీతోనూ శత్రుత్వం లేదని వివరణ
  • కొన్ని మీడియా సంస్థల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి తనపై వస్తున్న కొన్ని వార్తలను తీవ్రంగా ఖండించారు. జగన్ కు వ్యతిరేకంగా తాను తిరుపతి, విశాఖపట్నంలలో మాట్లాడినట్లు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

"జగన్ గారికి వ్యతిరేకంగా నేను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ గానీ, ఆన్ రికార్డు గానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల, విభేదించి పార్టీ వదిలానే కానీ, జగన్ గారికి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శతృత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా. లేదా నా అధికారిక 'ఎక్స్' ద్వారా తెలియజేస్తా. తెరవెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయటానికి ఉబలాటపడుతున్న వారు నల్ల కోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని కోరుతున్నాను" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.




Vijayasai Reddy
YS Jagan
YSRCP
Tirupati
Visakhapatnam
Andhra Pradesh Politics
Political News
Telugu News
Political Controversy
Media Statement

More Telugu News