Nandigam Suresh: గుర్తులేదు, అనుచరుల్లేరు.. పోలీసుల విచారణలో మాజీ ఎంపీ సురేశ్ పొంతనలేని సమాధానాలు

Nandigam Suresh Gives Inconsistent Answers in Police Investigation
  • నందిగం సురేశ్ మూడు రోజుల పోలీసు కస్టడీ పూర్తి
  • దాడి ఘటన తనకు గుర్తులేదని, తనవారెవరూ కిడ్నాప్ చేయలేదని వాంగ్మూలం
  • సురేశ్ బెయిల్ పిటిషన్‌తో పాటు, ఆయన భార్య ముందస్తు బెయిల్‌పై జూన్ 2న తీర్పు
  • మాజీ ఎమ్మెల్యే ఆళ్ల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 4కి వాయిదా
తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ (రాజు)పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ పోలీసుల విచారణలో పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన కృష్ణపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి తుళ్లూరు పోలీసులు సురేశ్ ను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు.

నిన్న కస్టడీ మూడో రోజు తుళ్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొంకా శ్రీనివాసరావు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సురేశ్ ను విచారించారు. సురేశ్ తరఫు న్యాయవాదికి సమాచారం అందించినప్పటికీ విచారణకు ఆయన హాజరుకాలేదు. కస్టడీ గడువు ముగియడంతో నేటి ఉదయం వైద్య పరీక్షల అనంతరం సురేశ్ ను మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు.

విచారణలో భాగంగా ‘కృష్ణపై దాడిలో పాల్గొన్నది ఎవరు? కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాలు ఎవరివి?’ అని పోలీసులు ప్రశ్నించగా, తన అనుచరులు ఎవరూ దాడికి పాల్పడలేదని, కిడ్నాప్ చేయలేదని సురేశ్ చెప్పినట్టు తెలిసింది. దాడిలో సుమారు 20 మంది పాల్గొన్నారని బాధితులు చెబుతున్నారంటూ పోలీసులు ఆధారాలు చూపించినప్పుడు, ఆ విషయం తనకు తెలియదని, గుర్తులేదని సురేశ్ మొక్కుబడిగా సమాధానమిచ్చారని సమాచారం. "మీకు ఎంతమంది అనుచరులు ఉన్నారు?" అని అడగ్గా, ఎంపీ పదవి పోయిన తర్వాత తన వెంట ఎవరూ లేరని ఆయన అన్నట్టు తెలిసింది. దాడి జరిగిన రోజు అనుచరులు వాడిన వాహనాలు ఎక్కడ ఉన్నాయన్న ప్రశ్నకు ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం.

కృష్ణ తనను అసభ్యంగా దూషించారని చెబుతున్న మీరు, ఆ విషయంపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించగా, సురేశ్ సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినట్టు సమాచారం. కృష్ణపై దాడికి సంబంధించి పోలీసులు పలుమార్లు ప్రశ్నలు అడిగినప్పటికీ, ఆయన దాటవేత ధోరణిలోనే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సాగిన ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇసుకపల్లి కృష్ణపై హత్యాయత్నం కేసులో నందిగం సురేశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నిన్న గుంటూరు రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి వి.ఎ.ఎల్. సత్యవతి వాదనలు విన్నారు. అనంతరం తీర్పును జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు. ఇదే కేసులో సురేశ్ భార్య బేబిరాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా అదే రోజు తీర్పు వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.

ఆళ్ల పిటిషన్‌పై విచారణ 4కు వాయిదా
మరోవైపు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీకి చెందిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణచక్రవర్తి జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినేందుకు వీలుగా విచారణను వాయిదా వేసినట్టు తెలిసింది. అప్పటివరకు రామకృష్ణారెడ్డిపై ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.
Nandigam Suresh
Nandigam Suresh arrest
Isukapalli Krishna attack case
Tulluru police investigation
Guntur court bail petition
Alla Ramakrishna Reddy
TDP office attack case
Mangalagiri MLA
Andhra Pradesh crime news
YSRCP leaders

More Telugu News